తుస్సుమన్న బీజేపీ, జోరులో కాంగ్రెస్

దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ సీట్లల్లో ఓడిపోగా…కాంగ్రెస్, విపక్షాలు జయకేతనం ఎగురేశాయి. యూపీలో బీజేపీ వ్యతిరేక కూటమి విజయ ఢంకా మోగించగా..కమలం చతికిలపడింది. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరతన్‌ బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడపై 41వేల ఓట్ల మెజార్టీ సాధించారు. మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మియాని డి శిరా, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థిపై 3,100సీట్ల మెజార్టీతో గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ముకుల్‌ సంగ్మా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలవడంతో అంపతి స్థానాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ సంగ్మా కుమార్తె మియాని శిరా గెలిచారు. 
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు అప్పుడే చుక్కెదురైంది. జోకిహట్‌ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) ఖాతా ప్రారంభించారు. జేడీయూ, ఆర్జేడీల మధ్య  పోరులో లాలూనే గెలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి నయీముల్‌ హసన్‌ బీజేపీ నేత అవనీష్‌ సింగ్‌పై సుమారు 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నూర్‌పూర్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చనిపోవడంతో ఇది ఖాళీ అయింది. ఉన్న సీటను బీజేపీ నిలుపుకోలేక పోయింది. 
కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ నియోజకవర్గంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించడం విశేషం. అక్కడ ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్ల భారీ తేడాతో గెలిచారు. ఇక ఝార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ అభ్యర్థి సీమా దేవి మహతో ఏజేఎస్‌యూ అభ్యర్థిపై దాదాపు 13, 500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోమియా అసెంబ్లీ స్థానాన్ని కూడా జేఎంఎం పార్టీనే దక్కించుకుంది. జేఎంఎం అభ్యర్థి బబితా దేవి బీజేపీ నేత మాఘవ్‌లాల్‌ సింగ్‌పై 1344 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మహారాష్ట్రలోని పాల్‌గఢ్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ హవా కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గోవిత్… ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన అభ్యర్థి శ్రీనివాస్ వనగపై 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ చింతామన్ వనగ మృతితో ఉపఎన్నికలు వచ్చాయి. 
ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానాన్ని ప్రతిపక్షాల మద్దతుతో ఆర్ఎల్డీ-ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తబుస్సం గెలిచారు. బీజేపీ అభ్యర్థి పై గెలవడం విశేషం. ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ముస్లిం ఎంపీగా ఆమె రికార్డు నెలకొల్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.