వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. టీడీపీలోకి కీలక నేత

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. అందుకోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మరోసారి పునరావృతం చేయకుండా ఉండేందుకు వైసీపీ అధినేత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, అవి ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ విషయం చాలా సార్లు నిరూపణ అయింది కూడా. జగన్ ఇప్పుడు అనుసరిస్తున్న కొత్త విధానంతో ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబిక్కింది. మొదటి నుంచీ నియోజకవర్గాల్లో పని చేస్తున్న వారిని కాదని, అంగ బలం, ఆర్థిక బలం ఎక్కువగా ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంతోనే ఇప్పటికే పలు చోట్ల పాతవారి స్థానంలో కొత్త సమన్వయకర్తలను కూడా నియమించాడు. ఇదే ఆ పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది. కొద్దిరోజుల కిందట గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టగా, తాజాగా నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర ‌రెడ్డి రూపంలో వైసీపీకి మరో షాక్ తగిలింది.

ఇటీవల జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర ‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన నాలుగేళ్లు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా పని చేశారు. వెంకటగిరి టికెట్‌ తనకు ఇస్తారనే నమ్మకంతో వైసీపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే బొమ్మిరెడ్డికి మాట మాత్రం చెప్పకుండా ఇన్‌చార్జిగా తొలగించిన అధ్యక్షుడు జగన్‌.. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించారు. తనను అవమానకర రీతిలో పక్కకు తప్పించడానికి జీర్ణించుకోలేని బొమ్మిరెడ్డి.. జగన్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన బొమ్మిరెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజుల్లో అనుచరులతో కలిసి ఆయన సైకిల్ ఎక్కనున్నారు. అయితే, ఆయనకు టికెట్ కేటాయించే విషయంలో క్లారిటీ ఇచ్చారా..? లేదా..? అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, తదితర నాయకులు బొమ్మిరెడ్డితో మంతనాలు జరిపారు. ఆయనను టీడీపీలో చేరేందుకు ఒప్పించారు. ఈయన చేరికతో ఆనం వెళ్లిపోయిన లోటు తీరినట్లవుతుందని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.