ఉత్తమ్ సంచలన ప్రకటన.. టీడీపీకి బిగ్ షాక్

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒకరోజు టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబితే, మరో రోజు మాత్రం ప్రజాకూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. మిగతా పార్టీల సంగతేమోగానీ, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమి మాత్రం ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా ఇదే ఫలితాలను వెల్లడించాయి. దీంతో కూటమి అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అందులోని భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి షాకిచ్చింది. శుక్రవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారయన. అంతేకాదు, ఆయన గెలిచేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో కూటమిలోని పార్టీలతో పాటు, ఆ నియోజకవర్గ ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున నామినేషన్ వేశారు. ఆయన కాంగ్రెస్‌ కండువాలు, సోనియా, రాహుల్‌ గాంధీ ఫొటోలతో ప్రచారం కొనసాగించారు. అంతేకాదు, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానమే తనను ప్రచారం చేసుకోమందని, ఆ మేరకు అనుమతి కూడా తీసుకున్నానని ఆయన చెప్పుకున్నారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెబెల్స్‌గా పోటీ చేసిన 19 మంది జాబితాలో మల్‌రెడ్డి పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో టీడీపీ నేతలు దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అటు నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. తాజాగా పోలింగ్‌కు ఒకరోజు ముందు అంటే గురువారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఓటర్లలో ఉన్న గందరగోళం తొలగించేందుకు మల్‌రెడ్డికే తాము మద్దతు ఇస్తున్నామంటూ ఆయన చెప్పారు. ఈ పరిణామం కూటమిలో కల్లోలానికి కారణమైంది. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.