ఎన్నికలకు ముందు మోదీకి ఊహించని ఎదురుదెబ్బ

గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా, మిత్రపక్షాలను కలుపుకొని 336 సీట్లు గెలిచుకుంది. మోదీ మేనియానే దీనికి కారణమని అప్పట్లో అంతా అనుకున్నారు. దీని తర్వాత త్రిపుర, మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధించింది. ఈ క్రెడిట్ కూడా మోదీ ఖాతాలోకే వెళ్లింది. దీంతో మోదీ హవా చాలా కాలం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కొన్ని సంస్కరణలకు ప్రజల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా భారీ స్థాయిలో ఉండడంతో కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగలడంతో మోదీ ప్రభ మసకబారిపోతుందని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్ఠానం సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోదీని కాకుండా కొత్త వారిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ పార్టీలోకి కొందరు సీనియర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే మోదీ స్థానంలో గడ్కరీ, శివరాజ్‌ చౌహాన్‌ల పేర్లు వినిపించినా.. ఇది నిజమో కాదోనన్న అనుమానం అందరిలో వ్యక్తమయింది. అయితే, ఈ కథనాలు నిజమేనని తెలుస్తోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్ఎస్) చేస్తున్న ప్రయత్నాలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. మోదీ, అమిత్ షాలో అపరిమితమైన గర్వం పెరిగిపోయిందని, పార్టీలోని సీనియర్లను లెక్క చేయని తనం వల్లే కొన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యామని బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తోంది. మోదీ నాయకత్వాన తదుపరి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేదని ఆ సంస్థ బహిరంగంగానే చెబుతోంది. అంతేకాదు, కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ పేరును కూడా అందులోని ప్రముఖులే తెరపైకి తీసుకువస్తున్నారు. దీనికితోడు ఈ సంస్థకు చెందిన పత్రిక ‘సామ్నా’లో కూడా మోదీ-షాలకు వ్యతిరేకంగా కథనాలు వెలువడుతుండడంతో శివసేన అభిప్రాయమూ ఇదేనన్న భావన అందరిలో కలుగుతోంది. ఏది ఏమైనా, మొత్తానికి ప్రధాని మోదీని పక్కనపెట్టేందుకు బీజేపీలోని సీనియర్లతో పాటు, పార్టీ అనుబంధ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.