వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చంద్రబాబుకు రిలీఫ్

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాల్లో బలోపేతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేసి.. మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ గెలిచిన స్థానాలను కాసేపు పక్కనపెట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలను బద్దలుకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లా కడపలో పాగా వేయాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అక్కడి పది స్థానాల్లో టీడీపీ కేవలం ఒక నియోజకవర్గంలోనే విజయం సాధించింది. అయితే, ఈ సారి వైసీపీకి చెందిన కీలక నేతలు సైకిల్ ఎక్కడంతో పాటు, ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో అక్కడ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం కూడా ఆ పార్టీకి బలం చేకూర్చుతోంది. దీంతో కడప గడపలో పసుపు జెండాను రెపరెపలాడించవచ్చని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. అయితే, ఆ జిల్లాలోని కీలక స్థానమైన జమ్మలమడుగులో ఏర్పడని కలహాలతో ఆ ఆశలు అడియాశలు అయ్యేలా కనిపించాయి.

గత ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో వైసీపీ తరపున ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. అయితే, తర్వాత రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. పోయిన ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్‌ నేత పి.రామసుబ్బారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మండలిలో విప్‌గా ఉన్నారు. కడప జిల్లాలో రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ ఇద్దరిలో ఒకరిని ఎమ్మెల్యేగా.. మరొకరిని కడప ఎంపీగా నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. దీనిపై గత మూడు నాలుగు రోజులుగా వారిద్దరు, వారి కుటుంబ సభ్యులు, అనుచర గణం అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇద్దరికీ ఎమ్మెల్యే సీటు పైనే ఆసక్తి ఉంది. తాను సిటింగ్‌ ఎమ్మెల్యేను కాబట్టి రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని ఆది కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్న మంత్రి ఎంపీ స్థానానికి మంచి అభ్యర్థి అవుతారని, తననే ఎమ్మెల్యేగా నిలపాలని రామసుబ్బారెడ్డి కోరుతున్నారు. పరిస్థితి చేయి దాటకూడదని భావించిన అధినేత ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారట. దీంతో ఇద్దరి మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారిద్దరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.