ఆఫర్ వర్కౌట్ అయింది.. కాంగ్రెస్ గూటికి సీమ నేత

ఏపీలో రాజకీయాలు ఎప్పుడెలా మారుతున్నాయో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నందున రాష్ట్రంలోని ప్రతి పార్టీ గట్టి వ్యూహాలు రచించుకుంటోంది. అయితే, ఏపీలో ఎన్ని పార్టీలు ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే జరగనుండగా బీజేపీ, కాంగ్రెస్, జనసేన వచ్చే ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపాలని సిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి భిన్నమైనది. ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసిందన్న కారణంతో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటేనే చీదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొనవల్సి వచ్చింది.

ఇటువంటి పరిణామాల నుంచి గట్టెక్కడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించాలని డిసైడ్ అయిపోయిన ఆ పార్టీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. విభజనకు ముందు కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న వారితో పాటు, మరికొందరు ముఖ్య నేతలను తమ పార్టీలోకి తీసుకురావాలని భావించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సొంతగూటికి తెచ్చుకోవడంలో ఆ పార్టీ హైకమాండ్ సక్సెస్ అయింది. ఆయన పార్టీలోకి రావడానికి ముందే పలువురు కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు. వారిని కూడా కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు.

అంతేకాదు, ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఏ పార్టీలో లేని నేతలపై కూడా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ.. గతంలో టీడీపీలోకి వెళ్తానని ప్రకటించి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాయలసీమకు చెందిన కీలక నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లోకి వస్తే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రాజ్యసభ సభ్యత్వం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీనికి సమ్మతించిన ఆయన ఈరోజు(శనివారం) రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 1994 వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన బైరెడ్డి.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2009 వరకు అదే పార్టీలో కొనసాగారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పోరాట సమితిని స్థాపించి, కొద్దిరోజుల క్రితం దానిని రద్దు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.