అదే జరిగితే టీఆర్ఎస్ గెలవడం కష్టమేనట

వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందాలని భావిస్తోంది. అందులో భాగంగానే డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రైతు బంధు పథకం వగైరా ప్రవేశ పెట్టింది. నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు చాలా రకాల నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై సానుకూల స్పందన వచ్చేయడంతో.. ఆ పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమా వచ్చేసింది. అయితే ఈ మధ్య ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలపడడం.. ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ పెట్టడం వంటి అంశాలతో ఆ పార్టీలో కలవరం మొదలైందట.

మొట్టమొదటి సారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదురించిన కేసీఆర్.. ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దానికి నాయకత్వం తానే వహిస్తానని ప్రకటించారు. అంతేకాదు, కొందరు జాతీయ నాయకులతో భేటీ కూడా అయ్యారు. ఉన్నట్లుండి ఏమైందో యూటర్న్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత టీఆర్ఎస్ వర్గాల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్-బీజేపీకి మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఒకవేళ ఇదే జరిగితే… గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలవడానికి కారణమైన ముస్లిం ఓట్లు ఈ సారి ఆ పార్టీకి పడే అవకాశం ఉండదట. అంతేకాదు క్రిస్టియన్లు, దళితులు టీఆర్ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి ఉండదని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంపై చాలా వ్యతిరేకత ఉన్నదన్న విషయం చాలా మందికి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, పెట్రోలు ధరల పెరుగుదల వంటి వాటి వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసే ఏ పార్టీకి ఓట్లు పడవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ గెలవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని ఆ పార్టీ నేతలో అనుకుంటున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.