బాబును ఆశ్చ‌ర్య ప‌రిచిన పారిశ్రామిక వేత్త‌

పెట్టుబడిదారులు ఎంతో ఆలోచిస్తారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? రాదా? అన్న అంశంపై అనేక రకాలుగా ఆరాతీస్తారు. లాభదాయకంగా ఉందనిపిస్తేనే ముందుకు వెళతారు. అమరావతి బాండ్లను సీఆర్‌డీఎ విడుదల చేయడానికి ముందు పలువురు ఇన్వెస్టర్లు రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇందులో ఓ ఇన్వెస్టర్‌ వేసిన ప్రశ్న అటు ముఖ్యమంత్రితోపాటు.. ఇటు అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ అమరావతి క్యాపిటల్‌ బాండ్లను విడుదల చేసింది. ఇందుకోసం 13 వందల కోట్ల రూపాయలకు బాండ్లను విడుదల చేయగా… అవి ముంబాయి స్టాక్ఎక్స్చేంజిలోని ఎలక్ర్టానిక్‌ బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ఒకటిన్నర రెట్లు అధికంగా ట్రేడ్‌ అయ్యాయి.. సీఆర్‌డీఏకు రెండువేల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వచ్చాయి. సోమవారం ఈ బాండ్లను ముంబాయి స్టాక్ఎక్స్చేంజిలో లిస్టింగ్‌ కూడా చేశారు. అమరావతి బాండ్లకు అంత క్రేజ్‌ వచ్చేందుకు వెనుక పెద్ద కథే ఉంది. అమరావతి బాండ్లను విడుదల చేసి నిధులను సమీకరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు సీఆర్‌డీఏ దీనిపై పెద్ద కసరత్తే చేసింది. ఒక్కో బాండ్‌ విలువ పది లక్షల రూపాయలు ఉండటంతో యాభై బాండ్లను ఒక ప్యాకేజీగా విడుదల చేసింది.. ఈ బాండ్లను విడుదల చేస్తున్నట్టు స్టాక్ఎక్స్చేంజిలోని ఎలక్ర్టానిక్‌ బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ఉండే ఇన్వెస్టర్లందరికీ ముందుగానే సమాచారం వెళ్లింది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరు.. తాత్కాలిక సచివాలయం.. అసెంబ్లీ.. శాసనమండలి.. ఆల్‌ ఇండియా సర్వీస్‌ అధికారుల నివాసాలు.. సీడ్‌ యాక్సిస్‌ రహదారులు.. కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం.. ప్రజాప్రతినిధులకు క్వార్టర్ల నిర్మాణం.. వీటన్నింటినీ పరిశీలించడంతో పాటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మనోభావాలను తెలుసుకునేందుకు అమరావతిలో పర్యటించారు.
వీరందరితో ఒకరోజు ముఖ్యమంత్రితో సమావేశం కూడా ఏర్పాటు చేయించారు. ఇందులో విదేశాలలో ఉన్న ఆర్ధికసంస్థల ప్రతినిధులతో పాటు దేశీయంగా ఉన్న పలు ప్రముఖ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముఖ్యమంత్రితో ముఖాముఖిలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాల సారవంతమైన భూములను భూ సమీకరణ కింద ఇచ్చిన నాటి నుంచి… నేటి వరకు జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి ఇన్వెస్టర్లకు వివరించారు. ప్రపంచబ్యాంకు.. దేశీయంగా ఉండే బ్యాంకుల కన్సార్టియం ఇచ్చే రుణంతో పాటు.. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు.. బాండ్లను విడుదల చేసి.. నిధుల సమీకరణ చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వారికి వివరించారు. అంతా విన్న ఇన్వెస్టర్లు సంతృప్తి చెందినప్పటికీ .. విదేశాలకు చెందిన ఓ ఇన్వెస్టర్‌ వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మీరు తిరిగి అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.. ఈ ప్రశ్నతో ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో పాల్గొన్న పలువురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి ముఖ్యమంత్రి పావుగంటపాటు వివరణ ఇచ్చారు.. తిరిగి తాము అధికారంలో ఎందుకు వస్తామో విశ్లేషించి చెప్పారు.. ముఖ్యమంత్రి చెప్పిన తీరుతో ఇన్వెస్టర్లు హర్షధ్వానాలు చేశారు.
ప్రభుత్వంపై ప్రజల సంతృప్తిశాతంతో పాటు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న విధానం.. మిగతా పార్టీల నేతలకు.. తనకు ఉన్న తేడా.. తన ట్రాక్‌ రికార్డు.. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు.. ఇప్పటి వరకు తనకున్న బ్రాండ్‌ ఇమేజ్‌ ద్వారా వచ్చిన మొబైల్‌ తయారీ యూనిట్‌.. కియా.. హెచ్‌సీఎల్‌.. ప్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ వంటి సంస్థల వివరాలను వారికి వివరించారు. దీంతో పెట్టుబడిదారులలో నమ్మకం రెట్టింపు అయ్యింది.. అందుకే ఇన్వెస్టర్లు ముంబాయి స్టాక్ఎక్స్చేంజిలోని ఎలక్ర్టానిక్‌ బిడ్డింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఫ్లోట్‌ చేసిన అమరావతి క్యాపిటల్‌ బ్యాండ్లు అత్యధికంగా ట్రేడ్‌ అయ్యాయి.. ముంబాయి స్టాక్‌ ఎక్సైంజ్‌లో లిస్టు అయిన అమరావతి క్యాపిటల్‌ బాండ్లు అతి త్వరలో లండన్‌.. సింగపూర్‌ స్టాక్ఎక్స్చేంజిలలో కూడా లిస్ట్‌ కానున్నాయనేది తాజా వార్త.. ఇదండీ బాండ్‌ల క్రేజ్‌ వెనుక ఉన్న అసలు కథ..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.