అయ్య‌న్న సీరియ‌స్ అయ్యాడ‌ట‌

ఆయన తిరుగులేని అధికారాలు ఉన్న మంత్రి. అటు పార్టీ, ఇటు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ జిల్లాలో పరిపాలనను నడిపించే ఇన్‌ఛార్జ్‌ మంత్రి కూడా! అంతేకాదు- ఆయన వెళుతున్నది మహానాడుకు. కానీ మంత్రికి తెలుగుదేశంపార్టీ జెండాలు కాకుండా బీజేపీ జెండాలు.. ప్లెక్సీలు.. తోరణాలు స్వాగతం పలికాయి. దాంతో ఆమాత్యులవారికి కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది.. జిల్లా పార్టీ నేతలపై సెటైర్లు వేశారు.

రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాలవారీగా.. నియోజకవర్గాల వారీగా మహానాడులను నిర్వహించింది తెలుగుదేశంపార్టీ! జిల్లా మహానాడులకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కూడా హాజరయ్యారు. గుంటూరులో జరిగిన మహానాడుకు ఆ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి … తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడికి తెలుగుదేశంపార్టీ జెండాలు స్వాగతం పలకాల్సింది పోయి బీజేపీ జెండాలు.. ఫ్లెక్సీలు స్వాగతం పలికాయి. అయ్యన్నపాత్రుడు ఒక్కసారిగా బిత్తరపోయారు. మనం వెళుతున్నది తెలుగుదేశంపార్టీ నిర్వహించే మహానాడుకా..? లేక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వెళుతున్నామా? అన్న డౌట్‌ వచ్చిందాయనకు! తనతో పాటు కారులో ఉన్న నేతలతో ఈ మాటే అన్నారు. అసలు మంత్రిగారికి ఇంత సందేహం ఎందుకొచ్చిందో తెలుసా..? గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీ మహానాడును వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేశారు..

ఆ మరుసటి రోజే రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది.. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్‌మాధవ్‌… ఇతర రాష్ట్ర నేతలకు స్వాగతం పలుకుతూ గుంటూరు నగరం నిండా బీజేపీ జెండాలు.. ఫ్లెక్సీలు.. స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న టీడీపీ నిర్వహించే మహానాడుకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర మినహా ఎక్కడా కనీసం జెండాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు మనసులో దాచుకోలేదు.. జిల్లా మహానాడులో నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆ తర్వాత నేతలకు కూడా ఘాటుగానే వాతలు పెట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉందా లేదా అనే సందేహం వస్తుందని తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. దీనికి పక్కనే ఉన్న మరో శాసనసభ్యుడు మద్దతు ఇచ్చారు. జరిగిన పొరపాటును జిల్లా పార్టీ నేతలపై నెట్టడానికి నగర పార్టీ నేతలు చూస్తే.. తప్పంతా నగరపార్టీ నేతలదేనని జిల్లా పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. విజ్ఞాన మందిరం దగ్గర తాము అలంకరణ చేశామని వివరణ ఇస్తున్నారు నగరపార్టీ నేతలు.. ఇందులో ఎవరిది కరెక్టో.. ఎవరిది రాంగో చెప్పడం కష్టమే కానీ.. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్టు ఆ రోజు గుంటూరు వెళ్లిన తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం కాసింత కన్‌ఫ్యూజన్‌ అయ్యారు. బీజేపీ నేతల హడావుడి చూసి మనం మహానాడుకు వచ్చామా..? కన్నా ప్రమాణ స్వీకారానికి వచ్చామా అన్న సందేహం వారికి కలిగింది. మనసులో దాచుకోలేని మంత్రి మాత్రం బయటపడ్డారు. మిగతా నేతలు మాత్రం లోలోపల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.