చంద్రబాబు వ్యాఖ్యలకు బిత్తరపోయిన అశోక్‌బాబు

సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమాంధ్రవ్యాప్తంగా మారుమోగిన పేరు అశోక్‌బాబు.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు సమైక్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అశోక్‌బాబు అటు ప్రభుత్వానికి.. ఇటు ఉద్యోగులకు మధ్య వారథిగా వ్యవహరిస్తూ అనేక సమస్యలు పరిష్కరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అశోక్‌బాబుకు మంచి పేరుంది. వచ్చే ఏడాది అశోక్ బాబు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఎన్జీవో అసోసియేషన్‌లో పలుకుబడి ఉన్న అశోక్‌బాబును పదవీ విరమణ తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్‌బాబును రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు.

2019 ఎన్నికలకు సర్వహంగులతో రంగంలోకి దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను దగ్గరికి తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా బెజవాడలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు అశోక్‌బాబు కూడా కలిసి నడిచారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగిస్తూ చివరిలో అశోక్ బాబును రాష్ట్రానికి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటివరకు ఉద్యోగులకు సేవ చేశారని, నిజాయితీ పరుడు, ముక్కుసూటిగా మాట్లాడే అశోక్‌బాబు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పరోక్షంగా తెలుగుదేశంపార్టీలో చేరాలని సూచించారు. చంద్రబాబు విజ్ఞప్తితో వేదిక పైనే ఉన్న అశోక్‌బాబు బిత్తరపోయారు. తనను ఇంతవాడిని చేసిన ఉద్యోగులతో మాట్లాడిన తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని అశోక్‌బాబు చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానానికి ఆయన ఆశ్చర్యపోయారు. అశోక్‌బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించడం వెనుక పెద్ద వ్యూహ్యమే దాగుంది.

ప్రస్తుతం పీఆర్సీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటును అశోక్ బాబు ద్వారా ప్రభుత్వం త్వరలో పూర్తిచేయబోతుంది. ఉద్యోగులు బలంగా కోరుకుంటున్న ఇతర సమస్యలను కూడా అశోక్ బాబు ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వరాలన్నీ ప్రకటించి, అమలు చేసిన తరువాత అశోక్ బాబుకు ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగుల్లో ఇమేజ్ మరింత పెరుగుతుందనేది ప్రభుత్వ వ్యూహంగా ఉంది. ఆ తర్వాత ఆయనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని రానున్న ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే విధంగా చేయాలనేది అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. అశోక్‌బాబు కూడా ఉద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పిమ్మటే వారి అభిప్రాయం తీసుకుని అప్పుడే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అశోక్‌బాబు పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్లుగానే కనిపిస్తోంది.

 

ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు.. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఉద్యోగ నేతలు రాజకీయాల్లో ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఇందుకు ఉదాహరణ. ఆయన ఏకంగా కొత్త పార్టీయే ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.