అరవింద సమేత వీరరాఘవ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ: హారికా అండ్ హాసినీ క్రియేషన్స్
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఇషా రెబ్బ, సునీల్, జగపతిబాబు, నాగేంద్రబాబు, రావు రమేష్, సుప్రియ పథక్, నవీన్ చంద్ర, సితార, ఈశ్వరీ రావు తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
యాక్షన్: రామ్ లక్ష్మణ్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత‌: రాధాకృష్ణ(చినబాబు)
ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాలుగు వరుస విజయాల తర్వాత మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన సినిమానే ‘అరవింద సమేత వీరరాఘవ’. అటు నందమూరి అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేశాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ నేపథ్యంలో భారీ సినిమా వస్తోంది. ఈ తరహా సినిమాలు తారక్ ఇంతకు ముందు చేసేశాడు. కానీ, త్రివిక్రమ్‌కు మాత్రం ఈ జోనర్ కొత్త అనే చెప్పాలి. తన మార్క్ పంచ్ డైలాగ్‌లతో పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ సినిమాను ఎలా తెరకెక్కించారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి ఈ సినిమా కూడా ఎన్టీఆర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయిందా..? త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఈ సినిమాను తెరకెక్కించారా..?

కథ

నల్లగుడి ఊరి పెద్ద బాసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు) మధ్య చిన్న గొడవ కారణంగా ఈ రెండు గ్రామాల్లో అలజడి రేగుతుంది. అప్పుడు మొదలైన గొడవతో రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నారప రెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) లండన్‌ నుంచి ఊరికి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా దాడిలో నారప రెడ్డి ప్రాణాలు కోల్పోతాడు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వెళ్లిపోతాడు. అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు ‘హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. ఒక‌సారి అర‌వింద‌పై అటాక్ జ‌రుగుతుంది. ఆ ప్ర‌మాదం నుంచి అర‌వింద‌ను ర‌క్షిస్తాడు వీర రాఘ‌వ‌. అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అసలు అరవింద మీద అటాక్ చేసింది ఎవరు..? వీర రాఘవ తన ఊరికి వెళ్లాడా..? తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకున్నాడా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
ఎంతో కాలంగా ఎదురు చేసిన కాంబినేషన్ వర్కౌట్ కావడంతో ‘అరవింద సమేత వీరరాఘవ’పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే చిత్ర బృందం ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని థీమ్ బేస్ చేసుకొని రాసిన కథతో, బలమైన పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం నెమ్మదిగా నడిపించారు. త్రివిక్రమ్ శైలి కామెడీ కూడా లేకపోవడం.. లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం ప్రేక్షకుడిని నిరాశ పరుస్తాయి. అయితే ఎన్టీఆర్ తన నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్‌తో ఈ సినిమాని మరో లెవల్‌కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. త్రివిక్రమ్ సినిమాలు గతంలో నెమ్మదిగా హిట్ టాక్ సంపాదించుకున్నట్లు ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలాగో వారం రోజులు మరే సినిమా లేదు కాబట్టి కలెక్షన్లకు మాత్రం ఢోకా లేదు.

నటీనటుల పనితీరు
సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోలా నడిచింది. సిక్స్ ప్యాక్ బాడీ, ఫ్రెష్ లుక్‌తో తారక్ ఆకట్టుకున్నాడు. గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో ఇంకా చాలా బాగా చేశాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో కీలకమైన ‘అరవింద’ పాత్రలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. అలాగే మరో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. అత్యంత క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌గా నటించిన జగపతి బాబు తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఎన్టీఆర్, జగపతిబాబు పోటీ పడి మరి నటించారు. మరో ముఖ్య పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన రావు రమేష్, సితార, రవి ప్రకాష్, శతృ ఎప్పటిలాగే తమ నటనతో ఆకట్టుకుంటారు.

టెక్నీషియన్ల పనితీరు
త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా పెనివిటీ పాట తమన్ కెరీర్‌లో చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది. త్రివిక్రమ్ స్క్రీన్‌పై ఆ పాటను తెరకెక్కించిన విధంగా కొత్తగా ఉండడంతో ఆకట్టుకుంటుంది. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మాస్ ప్రేక్షకులకు మంచి విందునిచ్చేవిగా ఉన్నాయి. వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పుంటే బాగుండేది. నిర్మాత కె రాధకృష్ణన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు

* ఎన్టీఆర్, జగపతిబాబు నటన

* బ్యాగ్రౌండ్ స్కోర్

* యాక్షన్ ఎపిసోడ్స్

* ఎమోషనల్ సీన్స్

* డైలాగ్స్

బలహీనతలు

* రొటీన్ స్టోరీ

* కామెడీ లేకపోవడం

మొత్తంగా: అరవింద సమేత వీరరాఘవుడు కుమ్మేశాడు

రేటింగ్: 3/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.