కువైట్ ప్రవాసాంధ్రులకు ఏపీఎన్నార్టీ సాయం

విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల బాగోగులను పట్టించుకుంటోంది ఏపీఎన్నార్టీ. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులంతా ఇప్పుడు ఏపీఎన్నార్టీలో సభ్యులుగా చేరుతున్నారు. తమ సాధక బాధలను పంచుకుంటున్నారు. అదే సమయంలో వారి సమస్యలను తీరుస్తోంది ఏపీఎన్నార్టీ. ఎన్నో ఆశలతో కువైట్ దేశం వెళ్లారు వేలమంది తెలుగువారు. వారిలో చాలా మంది వీసా గడువులు ముగిశాయి. అయినా సరే తిరిగి రాలేదు. వారికోసం చొరవ చూపింది ఏపీఎన్నార్టీ. అక్కడే వివిధ పనుల్లో మగ్గుతున్న ప్రవాసాంధ్రులను ఒక చోటుకు చేర్చింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపింది. వారికి ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ఉపయోగించుకొని, ఏపీఎన్‌ఆర్‌టీ(నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) సమకూర్చిన ఉచిత టికెట్లతో దాదాపు 3 వేల మంది ప్రవాసాంధ్రులు తిరిగి తెలుగు గడ్డపై అడుగు పెట్టనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగింది ఏపీఎన్నార్టీ ప్రతినిధి బృందం. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారినందరినీ కూడగట్టింది. మరోవైపు వారు ఏపీకి వచ్చినప్పటికీ ఉపాధి పొందేలా మూడు నెలల పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. అదే విషయాన్ని చెప్పారు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్‌, సీఈవో కె.సాంబశివరావు. శిక్షణ కాలంలో వారికి నెలకు రూ.3 వేల భృతితోపాటు, శిక్షణ అనంతరం ధ్రువపత్రాన్ని అందజేయనున్నారు. చిన్న చిన్న వ్యాపార నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. 
ఏపీ కోసం కువైట్ లో ఆందోళనలు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారత్ లోనే కాదు.. విదేశాల్లోను ఆందోళనలు సాగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు… కువైట్ లోను ఈ హోరు సాగుతోంది. ఏపి డిమాండ్స్ జస్టీస్ అనే నినాదంతో గల్ఫ్ దేశం కువైట్‌లో తెలుగుదేశం కువైట్, తెలుగు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఒమేరియా పార్కులో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు, తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కుదరవల్లి సుధాకర్ రావు ప్రధానంగా పాల్గొని తమ మద్దతు పలికారు. తెలుగు సంఘాల అధ్యక్షులతోపాటు తెలుగు దేశం కువైట్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అదే సమయంలో ఏపీకి న్యాయం చేసే విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని వారు ఖండించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రకటంచిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 
రాబోయే కాలంలో మోడీ, చంద్రబాబు కాంబినేషన్‌ను ప్రజలు కోరుకుంటున్నారని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్నీ విధాలా ఆదుకుని, 2019 ఎన్నికలలో కూడా కలిసి పనిచేసి అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సంఘాల నేతలు కొత్తపల్లి మోహన్‌బాబు, మేముసైతం నాగమణి, వడియరాజుల సేవాసంఘం తురక వెంకట సుబ్బయ్య, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రభాకర్ యాదవ్, తెలుగు దేశం కువైట్ మద్దిన ఈశ్వర్ నాయుడు, సుబ్బారెడ్డి, ముస్తాక్ ఖాన్, బత్యాల సేవా సమితి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.