ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైన ప‌ట్ట‌లేడ‌ట‌….

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం సహా అన్ని పక్షాలు రోడ్డెక్కాయి. కేంద్రం దుర్నీతిని దునుమాడుతున్నాయి. ఈ సమయంలోనే కొంతమంది ప్రత్యర్ధి శిబిరానికి అస్త్రాలను అందిస్తున్నారట. తద్వారా ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారట! ఇదీ కొందరిలో ఉన్న బలమైన అభిప్రాయం. ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ మార్కులు కొట్టేసిన కొంతమంది అధికారులే కీలక సమాచారం బయటకు పొక్కడంలో సూత్రధారులుగా ఉన్నారట! దీనిపై ఏపీ మంత్రులే చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలిచే సమయంలోనే ఆ టెండర్ల సమాచారం అంతా బయటకు పొక్కింది. అది కాస్తా ప్రత్యర్ధి శిబిరానికి చేరిందని పలువురు మంత్రులు చెబుతున్నారు.
మరికొన్ని శాఖల్లోని కీలక సమాచారం కూడా గుట్టుచప్పుడు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిపోతోందట! ఈ విధంగా సమాచారం ఎలా లీకవుతోందన్న అంశంపై ఇప్పుడు లోతుగా ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల పనితీరు బాగోకపోతే ముందుగానే వారికి పదవీ విరమణ కల్పించే విషయమై ఉత్తర్వులు వెలువడబోతున్నాయనీ, అధికారుల స్థాయిలో ఈ ఉత్తర్వులు సిద్ధమయ్యాయంటూ గతంలో ఓ సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయంలో లీకువీరులు ఎవరో ప్రభుత్వం తెలుసుకుంది. అలాగే మరికొన్ని శాఖల నుంచి కూడా  సమాచారాన్ని సేకరించి.. ప్రత్యర్థులకు తెలివిగా చేరవేస్తున్న వారు ఎవరో ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికీ తెలిసిందట. ఈ విషయాన్ని కూడా కొందరు మంత్రులే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్‌లో, మరికొన్ని శాఖలలో అధికారుల కదలికలపై, వారు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయమై నిఘా పెరిగింది. ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రులు ఒకరిద్దరికి ఏపీలో ఉన్న ఇరువురు అధికారులు సమాచారం చేరవేస్తున్నారట. ఈ అంశాన్ని కూడా రాష్ట్రమంత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇటువంటి అధికారులు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పేందుకు ఎవరు సాహసించడంలేదు. ఏదో ఒక రోజు ఆయనకు ఎవరో ఒకరు చెప్పాల్సిన సమయం ఆసన్నమౌతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
కొన్ని శాఖలలో కిందిస్థాయి అధికారుల ద్వారా ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని రాబడుతున్నారనీ, రాష్ట్రంలో ప్రతిపక్షానికి, ఢిల్లీలో బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలకు ఆ సమాచారాన్ని చేరవేస్తున్నారనీ ఓ మంత్రి చెప్పుకొచ్చారు. పట్టిసీమ అవకతవకలపై ఒకరిద్దరు అధికారులే బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజుకు సమాచారం అందించారట. నివేదికలు కూడా ఇచ్చారట! ఎన్నికల సంవత్సరంలో ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలనీ, ఇంటిదొంగలపై గట్టి నిఘా పెట్టాలనీ ఆ మంత్రులు విశ్లేషించారు. తగిన సమయంలో ఈ ఇంటిదొంగలపై ముఖ్యమంత్రికి నిర్మొహమాటంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తామని ఆ మంత్రులు చెప్పారు. ఇదండీ ఇంటిదొంగల కథ! 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.