టాలీవుడ్‌ హీరోలకు ఆంధ్రా పౌరుల సూటి ప్రశ్నలు

మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేశాడు.. సూపర్ స్టార్ మహేశ్ మొక్కను నాటాడు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా పని పూర్తి చేశాడు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఛాలెంజ్ స్వీకరించాడు.. ఈ మధ్య తరచూ వింటున్న మాటలు ఇవి. అసలు దేని గురించి ఈ గోల అనుకుంటున్నారా..? ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి సంబంధించిన గ్రీన్ ఛాలెంజ్‌. అంటే ఎవరో ఒకరు ఒక మొక్క నాటడం.. మీరు కూడా నాటండి అంటూ మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసరడం దీని వెనకున్న కథ. పలు రంగాలకు చెందిన వారితో పాటు, ఎక్కువ మంది సినీ ప్రముఖులు దీనిని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టే ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా..?

ఎందుకంటే.. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఐదు కోట్ల మంది ఆంధ్రా ప్రజల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. గతంలో పలు రకాల ఛాలెంజ్‌ల పేరిట సినీ ప్రముఖులు అనేక ఫీట్లు చేశారు. అప్పుడు రాని వ్యతిరేకత ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్ ఛాలెంజ్‌కు వస్తోంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కార్యక్రమం కావడం.. అలాగే ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకునే ప్రత్యేక హోదా విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ తనకు అంటీ ముట్టనట్టుగా ఉండడమే. ఈ విషయంలో కడుపు మండిన ఏపీలోని కొందరు పౌరులు సోషల్ మీడియా ద్వారా సినీ ఇండస్ట్రీపై తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. సినీ పరిశ్రమలోని పెద్దలపై, స్టార్ హీరోలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా తమకు కావాలి అంటున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని పార్టీలు కూడా పోరాటం చేస్తున్నాయి. మొన్న టీడీపీ పెట్టిన అవిశ్వాసంతో ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఏపీలో ఇంత జరుగుతున్నా.. సినీ పరిశ్రమలోని పెద్దలు ఎందుకు స్పందించరు..? ఇప్పటి వరకు ఆ ఛాలెంజ్ అని, ఈ ఛాలెంజ్ అని ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చాయి. వాటికి స్పందించే సినీ తారలు, పరిశ్రమలోని పెద్దలు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడరు..? విభజన చట్టంలోని ఏపీ హక్కుల కోసం ఎందుకు ప్రశ్నించరు..? అంటూ సోషల్ మీడియా వేదికగా హీరోలను ప్రశ్నిస్తూ.. తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. వారి ఆవేదనకు అర్థం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే దీనికి చాలా మంది నుంచి మద్దతు లభిస్తోంది.

మొన్నామధ్య శ్రీరెడ్డి వ్యవహారాన్నే తీసుకుంటే.. ఆమె ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని పోరాటం చేసింది. ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపింది. దీంతో ఆమెను ఇండస్ట్రీ నుంచి వెలివేశారు. అదే సమయంలో ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆ టీవీ అధినేత సినీ ఇండస్ట్రీలోని మహిళలను కించ పరిచారని ప్రెస్ మీట్ పెట్టి మరీ నానా హడావిడి చేశారు. మరి ఏపీకి అవసరమైన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ తదితర అంశాల విషయంలో సినీ పరిశ్రమలోని హీరోలు ఎందుకు స్పందించడంలేదనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. తెలంగాణ కార్యక్రమాలను ప్రమోట్ చేసే ఇదే సినీ పెద్దలకు ఏపీ అంత ముఖ్యమైన రాష్ట్రం కాదా..? అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించడంలేదా..? అసలు ఎందుకు ఏపీ సమస్యల గురించి స్పందించరు..? అనేవి జావాబు దొరకని ప్రశ్నలుగానే ఉంటున్నాయి. ఎంత సినీ ఇండస్ట్రీ తెలంగాణలో ఉన్నా.. వారు ఏపీలో షూటింగ్‌లు, వ్యాపారాలు చేసుకోవడంలేదా..? మరి ఎందుకీ మౌనం అంటే మాత్రం సమాధానం రావడంలేదు. మరి, టాలీవుడ్ ఏపీ సమస్యను తన సమస్యగా ఎప్పటికి అనుకుంటుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.