‘బీజేపీ సీఎం’లకు చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ బీజేపీపై పోరాటం చేస్తోంది. ఆ మధ్య జరిగిన వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన టీడీపీ.. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ పరిణామాలతో బీజేపీ అధిష్టానం సైతం ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించింది. అంతేకాదు, చంద్రబాబును, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని సలహాలు, సూచనలతో ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. అయినా వాళ్లు టీడీపీని చేసిందేమీ లేకపోగా.. రోజురోజుకూ బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతోంది. గతంలో ఆ పార్టీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, తదితర సంస్కరణలకు తోడు ముడి చమురు ధరలు బాగా పెరిగిపోవడంతో కేంద్రంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదే అదునుగా టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం బీజేపీకి చెమటలు పట్టిస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన సమస్యగా ఉన్న పెట్రో ధరల పెరుగుదల ప్రజల నడ్డి విరుస్తోంది. దీనికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ భారత్ బందును కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనవంతుగా స్పందించింది. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. కేంద్రం కూడా ఇలాగే చేయాలని… పెట్రో భారం తగ్గించాలని కోరింది. ‘మా నిర్ణయం కేంద్రానికి సవాల్‌లాంటిది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రో మంటను తగ్గించాలంటూ సోమవారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ… పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచే తగ్గింపు అమలులోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.1120కోట్ల ఆదాయం తగ్గుతుందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు సింహస్వప్నంలా మారింది. లోటు బడ్జెట్ ఉన్నా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇకనైనా కేంద్రం స్పందిచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.