అక్కడ యాత్ర చేయొద్దు.. జగన్‌కు ప్రభుత్వం లేఖ

ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్రకు.. అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అధికారులు వైసీపీ అధినేతకు లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏం చేయాలో తెలియక వైసీపీ నాయకులు తలలు పట్టుకున్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్‌లో ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన జగన్ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొత్తం ఈ యాత్రలో ఆరు నెలల పాటు, మూడు వేల కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ప్రతి జిల్లాలో ఐదు నియోజకర్గాల్లో మొత్తం 13 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగేలా ప్రణాలిక రూపొందించారు. ఈ యాత్రలో 5 వేలకుపైగా సమావేశాలు, 180 సంఘాలతో సభలు, 125 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే దాదాపు 190వ రోజుకు చేరుకుంది ఆయన పాదయాత్ర. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్.. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన యాత్ర కొనసాగుతోంది. దీని తర్వాత ఆయన కొవ్వూరు రోడ్ కం రైల్ బ్రిడ్జీ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రవేశించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ వైసీపీ దరఖాస్తు పెట్టుకుంది. ఈ లోపే ఏపీ ప్రభుత్వం జగన్‌కు షాకిచ్చింది.

రాజమండ్రిలోని గోదావరి వంతెనపై వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వంతెన బలహీనంగా ఉన్నందున ఎక్కువమంది ఒకేసారి వస్తే ప్రమాదమని స్పష్టం చేసింది. ఈమేరకు ఆయనకు ఓ లేఖ పంపింది. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించామని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రమాదం పొంచి ఉన్నందున పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని సూచించారు. దీనితో పాటు కొటిపల్లి బస్టాండ్‌ పరిసరాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని అన్నారు. సభను వేరే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.