ఒక‌వైపు కిల్లి… మ‌రోవైపు కోండ్రు… మ‌ధ్య‌లో?

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాంది ఇటీవ‌ల‌ శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన‌పుడు ఒక ఆస‌క్తిక‌ర అంశం చోటుచేసుకుంది. ముందుగా ఆయ‌న‌ను కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళిలు క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికితోడు ఇది ప‌లు అనుమానాల‌కు కూడా తావిస్తోంది. వారు రాబోయే రోజుల్లో పార్టీకి ఏదైనా షాక్ ఇస్తారా? అనే చ‌ర్చ‌కూడా న‌డుస్తోంది. అయితే శ్రికాకుళం ప‌ర్య‌ట‌న‌లో ఉమెన్ చాందీని  ఆ ఇద్ద‌రు నాయకులు క‌ల‌వ‌డంతో పార్టీకి కాస్త ఊపిరి ల‌భించిన‌ట్లయ్యిందంటున్నారు. వారిని చూసిన‌ ఉమెన్ చాందీ మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ కు మంచిరోజులు రానున్నాయ‌ని మీడియా ముందు ఆశాభావాన్ని వెళ్ల‌గ‌క్కారు. చాలాకాలంగా ఈ ఇద్దరు నాయకుల తీరుపై స్థానిక నేత‌ల్లో ప‌లు అనుమానాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల కొంత‌కాలంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళి పార్టీ ఫిరాయిస్తారనే వార్త వినిపిస్తోంది. ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీలోకి వెళ్తారంటూ విప‌రీత ప్ర‌చారం జ‌రిగింది.
అయితే వారిద్దరూ ఇలా ఉమెన్ చాందీని కలిసేస‌రికి స్థానిక నేత‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. వారు మనసు మార్చుకున్నారా? అనే చర్చ ఊపందుకుంది. అలాగే వారిద్దరూ రాజకీయ స‌మీక‌ర‌ణ‌లు లెక్కించాకే ఇటువంటి నిర్ణయం తీసుకునివుంటార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. స్థానికంగా ఇప్పటికిప్పుడు మిగిలిన పార్టీలలో పొజిషన్ అంత సజావుగా లేదన్న భావ‌న‌తోనే వీరు మ‌ళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌ని అంటున్నారు. ఇప్పుడున్నప‌రిస్థితిలో పార్టీ నుంచి జంప్ చేస్తే త‌మ‌కు ఒరిగేది లేదని ఈ నాయకులు భావిస్తున్నారని స‌మాచారం. అంతే కాదు వీరు దేశంలోనూ, ఏపీలోనూ మారుతున్న రాజ‌కీయ పరిస్థితులను  బేరీజు వేసుకున్న త‌రువాతే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే వార్త వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో  బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం ఏపీలోనూ ఉంటుంద‌నే వార్త వినిపిస్తోంది.  దాంతో ముందు చూపుతోనే కిల్లి కృపారాణి, మాజీ మంత్రి  కోండ్రు మురళి ఇలా యూట‌ర్న్ తీసుకునివుంటార‌ని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైన‌ప్పటికీ ఏపీ కాంగ్రెస్‌కు ఉమెన్ చాందీ కొత్త ఊపిరి పోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నుకోవ‌చ్చు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.