అవ‌గ‌తంకాని అథిష్టానం వైఖ‌రి… చిక్కుల్లో ఏపీ బీజేపీ నేత‌లు

ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ నాయకుల ప‌రిస్థితి  కుడితిలో ప‌డిన ఎలుక‌లా త‌యార‌య్యింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాలుగేళ్ల పాటు కమలంతో చెలిమి చేసినప్పుడు లేని ప‌రిస్థితులు ఇప్ప‌డు బీజేపీ నేత‌ల‌కు ఎదుర‌వుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బాబు ముంద‌డుగు వేసిన త‌రువాత ఏపీలో బీజేపీ పరిస్థితి తలకిందులైంది. మ‌రోమార్గంలేక బీజేపీ నేత‌లు టీడీపీని టార్గెట్ చేయాల్సి వ‌స్తోంద‌ట‌!. అందుకే కన్నా లక్ష్మీనారాయణ,  సోము వీర్రాజు టీడీపీపై విమ‌ర్శ‌ల దాడిని పెంచేశారు. అయితే హోదా ఎందుకు ఇవ్వటం లేదన్న బాబు ప్రశ్నకు వారు  సమాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల ఆంధ్రప్ర‌దేశ్‌లో  పర్యటించిన నితిన్ గడ్కరీ చాలా వరకూ పాజిటివ్ గా మాట్లాడేందుకే ప్ర‌య‌త్నించారు. పోలవరం ప‌నుల‌ను ప్రత్యక్షంగా సందర్శించి, ఆ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విశాఖలోనూ తెలుగు దేశంపై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు. అయితే ఇది ఏపీ బీజేపీ నాయకులకు మింగుడు ప‌డ‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
చంద్ర‌బాబు కేంద్రాన్ని అంత‌లా విమ‌ర్శిస్తున్నా, నితిన్ గ‌డ్క‌రీ… బాబును విమ‌ర్శించ‌పోవ‌డంపై  ఏపీ బీజేపీ నేత‌లు గరంగ‌రంగా  ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నితిన్ గ‌డ్క‌రీ… చంద్రబాబు ప‌నితీరును మెచ్చుకోవ‌డాన్ని ఏపీ బీజేపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా నితిన్‌ పోలవరం విషయంలో బాబు పడుతోన్న తపనను మెచ్చుకున్నారు.  హోదా అన్యాయంలో టీడీపీ… మోదీనే కార‌కునిగా ఆరోపిస్తున్నా నితిన్ స్వ‌యంగా బాబుని మెచ్చుకోవ‌డంలోని ఆంత‌ర్యం ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. తామంతా నిత్యం విమర్శిస్తోన్న టీడీపీని కేంద్ర మంత్రి పొగడ్తల్లో ముంచెత్తటం ఏజీ బీజేపీ నేత‌ల‌కు మింగుప‌డ‌టం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల‌తో  చంద్ర‌బాబుకు వ‌చ్చే చిక్కేమీలేదు. అయితే ఏపీ బీజేపీ నేతలకు.. వారి అధిష్టానం వైఖ‌రి అర్థంకాక‌ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.