దక్షిణాన మోదీకు వ్య‌తిరేక కూట‌మి!

ఒడిషా వాళ్ల‌కు ఒళ్లు మండుతోంది. క‌ర్ణాట‌క‌కు క‌డుపు కాలుతోంది. ఏపీకు తెగువ చూపాల్సిన స‌మ‌యం అస‌న్న‌మైంది. త‌మిళ‌నాడు అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంది. వీళ్లంద‌రిదీ ఒకే టార్గెట్‌.. న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షా. ఎస్‌.. ద‌క్షిణాధి రాష్ట్రాల‌న్నీ ఏక‌తాటిపై వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీనికి ఉత్త‌రభార‌తంలో వున్న బీజేపీయేత‌ర రాజ‌కీయప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధంగా ఉన్నాయ‌నే సంకేతాలు అందుతున్నాయి. సూప‌ర్‌స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ ప్ర‌క‌టించిన రోజున‌.. ఢిల్లీ సీఎం, ఆప్ అధ్య‌క్షుడు కేజ్రీవాల్ మ‌ద్ద‌తుగా నిల‌వ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. నిన్న అదిలాబాద్‌లో జ‌రిగిన స‌భ‌లోనూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పొరుగు రాష్ట్రాల‌తో మ‌న‌కు స‌ఖ్య‌త ఉండాలంటూ త‌మ అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు. చోటుచేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీలో కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌నేది అర్ధ‌మైన‌ట్లుంది. అందుకే.. బీజేపీ నేత‌లు మీడియా స‌మావేశాల్లో ఆచితూచి స్పందిస్తున్నారు. ఏపీ, తెలంగాణాల్లో మాత్రం క‌మ‌ల నాథులు గొంతు పెంచ‌టం కొస‌మెరుపు. ఇంత‌టి పెనుమార్పు వెనుక‌. కీల‌క‌మైన నేత చంద్ర‌బాబునాయుడు అనే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇరువురి ప్ర‌యోజ‌నాల రీత్యా.. టీడీపీ, బీజేపీ మ‌ధ్య పొత్తు కుదిరింది. కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోను మంత్రిప‌ద‌వులు ఇచ్చిపుచ్చుకున్నారు. అయినా కేంద్రం గ‌తంలో ఇచ్చిన‌ట్లుగా ప్ర‌త్యేక‌హోదా, ప్యాకేజీ హామీల‌పై ఒంటెద్దు పోక‌డ‌లు పోతోంది. నాలుగేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్ట్ ముంద‌డుగు వేయ‌లేక‌పోతున్నాయి. ఇదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకు ఎదురుగాలి త‌ప్ప‌ద‌నేది తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌. అయితే.. దీనంత‌టికీ కార‌ణం బీజేపీ అనేది ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నేది టీడీపీ యోచ‌న‌. అందుకే.. నిధులేనిదే.. అభివృద్ధి ఎలా! అంటూ కేంద్రంపై టీడీపీ స‌ర్కారు ఎదురుదాడికి దిగుతోంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌తంలోనే ఉత్త‌రాధి ఆధిప‌త్యంపై మండిప‌డ్డారు. మేం మ‌నుషులం కాదా అంటూ కేంద్రాన్ని నిల‌దీశారు. వామ‌ప‌క్షాలు ఆల్రెడీ.. మోదీ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. చేతులారా.. ఎన్‌డీఏ కూట‌మి చేసుకున్న త‌ప్పిదాలు.. కొత్త కూట‌మికి బలాన్నిస్తాయ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.