ఏపీ ఎన్‌ఆర్టీ ఖాతాలో మరో మైలురాయి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్ర‌ముఖ ప్ర‌వాసాంధ్రుల సంస్థ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్‌ఆర్టీ) అమరావతి అభివృద్ధికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే జూన్ 22న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో జూన్ ఏపీ ఎన్‌ఆర్టీ ఐకానిక్ టవర్‌కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న పది ఐటీ కంపెనీలను ఆగస్టు 1న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మంగళగిరి NRT టెక్ పార్క్ నుంచి పని చేసే ఐదు కంపెనీలతో పాటు, విజయవాడలోని మూడు, గన్నవరం మేధా టవర్స్ నుంచి పని చేసే రెండు కంపెనీలను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సంస్థ ప్రకటించింది. ఆగస్టు 1 అనగా బుధవారం ఉదయం పది గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభోత్సవం చేయవలసిన ప్రాంతానికి చేరుకుంటారు. అనంతరం పది కంపెనీలకు సంబంధించిన శిలాఫలకాలను ఆయన ప్రారంభిస్తారు. దీని తర్వాత ఆ కంపెనీలకు చెందిన సీఈవోలతో ఆయన సమావేశమై, చివర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

విదేశాల్లో ఉండే తెలుగువారు మాతృ భూమి రుణం తీర్చుకోవాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ఎన్‌ఆర్టీ ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో నివసిస్తున్న సుమారు 40 లక్షల మంది తెలుగువారికి ఐక్యవేదికను స్థాపించి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోంది. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటూ, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు తోడ్పాటునందించాలనుకున్న ఆ సంస్థ అందుకు అనుగుణంగా ముందుకెళ్తుంది. ఏపీ సీఎం చంద్రబాబుకు సహకారమందిస్తూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించి, అత్యాధునిక సాంకేతిక వసతులున్న స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అమరావతిలో ఏపీ ఎన్‌ఆర్టీ విశేషంగా పని చేస్తోంది. ఈ సంస్థ వల్ల ఏపీకి అనేక ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. సొసైటీలోని పెట్టుబడుల విభాగం సహకారంతో ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన దాదాపు 80కి పైగా కంపెనీలు రాష్ట్రంతో వ్యాపార పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.