అనిల్ అంబానీ అందుకే వచ్చారా…

సిఎం చంద్ర‌బాబునాయుడుతో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ భేటీ అయిన సంగతి తెలిసిందే. పైకి పరిశ్రమల ఏర్పాటు అని చెబుతున్నా… అసలు కారణం వేరే ఉందంటున్నారు. రాజ‌కీయ కోణ‌ం ఇందుకో ప్రధాన అంశమని తెలుస్తోంది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇపుడిదే విష‌య‌మై చ‌ర్చ జరుగుతోంది. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, పురోగ‌తి అంశాలపై చర్చించేందుకే అనిల్ అంబానీ వచ్చారని చెబుతున్నారు. అనిల్ అంబాని ఇటు చంద్ర‌బాబుతో పాటు అటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడికీ కావాల్సిన వ్యక్తి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు కూడా అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో రాజీ చర్చలు జరుపుతున్నారనే వాదన లేకపోలేదు. 
నిజం తెలుసుకున్నారట…
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక చంద్ర‌బాబు-మోడీ మ‌ధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చే వీలుంది. ఇంకోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేసీఆర్ తో మాట్లాడారంటున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో దూకుడుగా వెళ్లవద్దని వెంకయ్య చెప్పారంటున్నారు. ఇప్పుడు అనిల్ అంబానీ నేరుగా చంద్రబాబు వద్దకే రావడంతో అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకుంది. ఏపీకి హోదా విషయంలో మోడీ వైఖరికి నిరసనగా చంద్రబాబునాయుడు పెద్ద యుద్దమే చేస్తున్నారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును తామే చేస్తానంటూ చంద్రబాబు భుజానకెత్తుకున్నారు. అందులోనే కాదు.. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలోను అక్రమాలు జరిగాయని కాగ్ అనుమానం వ్యక్తం చేసింది. ఫలితంగా కేంద్రం ఆ నివేదికను ఆధారం చేసుకుని చంద్రబాబుపై కేసు పెట్టేందుకు సిద్దమైందనే వాదన సాగుతోంది.    
ఇద్దరికీ నష్టమే…
మోడికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఇది బీజేపీని ఇరుకున పెడుతోంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సరే. లేకపోతే అది చంద్రబాబు దెబ్బగా మారే వీలుంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. టీడీపీ లేక మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే సరి. లేకపోతే ఇబ్బంది తప్పదు. బీజేపీ-టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. అందుకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ సారి కూడ అలా చేస్తే మంచిదనే ఆలోచన అంబానీ మెదడులో ఉందంటున్నారు. బీజేపీకి చెందిన కొందరు పెద్దలు చంద్రబాబును పోగొట్టుకోవడం ఇష్టం లేదంటున్నారు. అందుకే తిరిగి వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 
రాయబారం…
సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ-టీడీపీలు విడిపోవ‌టం రెండు పార్టీల‌కు న‌ష్టం అనేది వాస్తవం. ఆ సంగతి చంద్ర‌బాబుతో పాటు అటు మోడీ, అమిత్ షా లకు తెలుసు. మ‌ళ్ళీ రెండు పార్టీలు క‌ల‌వడం అంత తేలిక కాదు. చంద్ర‌బాబు-మోడీని ద‌గ్గ‌ర చేయాలంటే అందుకు ఇద్ద‌రికీ స‌న్నిహితులై ఉండాలి. అందుకే అడాగ్ (అనిల్ ధీరూబాయ్ అంబాని గ్రూప్) ఛైర్మ‌న్  అనిల్ అంబాని రంగంలోకి దిగిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. వాస్తవంగా నెల్లూరు, వైజాగ్ లో విద్యుత్, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న ప‌రిశ్ర‌మ‌లు పెట్టే విష‌యంలో అనిల్ అంబానీ చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ఫలితంగా ప్ర‌భుత్వం నుండి పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారు. కానీ ప్రాజెక్టులో పురోగ‌తి లేదు. తామిచ్చిన భూముల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని ఉన్న‌తాధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆపని చేయవద్దని చంద్ర‌బాబుకు అనిల్  చెప్పారంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.