పాపం ఆనం.. టీడీపీలో ఉంటే అదైనా దక్కేది

ఆనం రామనారాయణ రెడ్డి.. గత కొద్దినెలలుగా ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, కీలక పదవులు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విభజన తర్వాత టీడీపీలో చేరారు ఆనం బ్రదర్స్. వారిలో వివేకా మరణించారు. ఆయన అకాల మృతి తర్వాత రామనారాయణ రెడ్డి టీడీపీకి దూరమవుతూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయన టీడీపీని వీడుతున్నానని, త్వరలోనే వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఇది జరిగినప్పటి నుంచి ఆనం వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, దీనిపై స్పష్టత రాకపోవడంతో ఇటీవల ఆ పార్టీ అధినేత జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే కలిసి, అక్కడే భేటీ అయ్యారు. అప్పటి నుంచి వైసీపీలో చేరే విషయంలో రేపు, మాపు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అషాడం ఎఫెక్ట్ కూడా ఆయనపై పడిందని అప్పట్లో వార్తలు కూడా హల్‌చల్ చేశాయి.

తాజాగా ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన వైసీపీలో చేరుబోతున్నారట. శ్రావణమాసం నడుస్తుండటంతో అధికారికంగా పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారని ఆనం సన్నిహితులు, జిల్లా వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. అదే రోజు వైఎస్‌ వర్థంతి కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు విశాఖలో ఏర్పాటు చేసే వైఎస్‌ వర్థంతి కార్యక్రమానికి హాజరై, పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వినికిడి. ఆనం రామనారాయణ రెడ్డి చేరికను వైసీపీలోని మేకపాటి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అందుకే ఆయన పార్టీలో చేరే విషయంలో ఆలస్యం అయిందని గతంలో వార్తలు వచ్చాయి.

జగన్‌తో భేటీ అయిన సందర్భంలో ఆనంకు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇది వాస్తవమేనని ఆనం సన్నిహితులు కూడా చెప్పుకున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ విషయంలో జగన్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి కూడా.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయనకు వెంకటగిరి టికెట్ కన్ఫార్మ్ అయినట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. అంటే ఆనం వైసీపీలో చేరినా పోటీ చేసే విషయంలో క్లారిటీ మాత్రం లేదని సమాచారం. ఈయన పరిస్థితిని చూసిన వారందరూ టీడీపీలో ఉంటే ఆత్మకూరు టికెట్ అయినా దక్కేది కదా అనుకుంటున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.