
నిర్మాణ సంస్థ: స్వాజిత్ మూవీస్
తారాగణం: నాగశౌర్య, బేబీ షామిలి, సుమిత్ర, రావు రమేశ్, శివాజీ రాజా, హేమ, సుధ, రవిప్రకాశ్, షకలక శంకర్ తదితరులు
సంగీతం: కల్యాణ రమణ
నేపథ్య సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
కూర్పు: జేపీ
సహ నిర్మాత: కేఆర్
నిర్మాత: రాజేశ్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సూర్య
కుటుంబ కథా చిత్రాలకు తెలుగులో ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే యువ కథానాయకులు కూడా కుటుంబ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడుగా ఇటీవల వచ్చిన ‘శతమానం భవతి’ చక్కటి కుటుంబ కథా చిత్రంగా ఆకట్టుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే యువ హీరో నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ‘ఛలో’ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగశౌర్య ఈ సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడో లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
సూర్య నారాయణ, సీతా మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉంటారు. ఆస్తి పంపకాల్లో తలెత్తిన మనస్పర్దల కారణంగా కుటుంబ పెద్ద సూర్య నారాయణ కన్నుమూస్తాడు. దీంతో కొడుకులు, కూతుళ్లు అందరూ తల్లిన ఒక్కదాన్నే వదిలేసి ఇంటికి దూరంగా వెళ్లిపోతారు. 20 ఏళ్లు గడిచినా ఇంటికి ఎవరూ రారు. అయితే అప్పటికే అమ్మమ్మ అంటే ఇష్టపడే సంతోశ్(నాగశౌర్య) కుటుంబాన్ని కలపాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంటి పెద్దకుమార్తె కొడుకు అయిన సంతోశ్ తన అమ్మమ్మ కళ్లలో సంతోషం చూసేందుకు ఏం చేశాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘అమ్మమ్మగారిల్లు’.. పేరులోనే స్టోరీ లైన్ ఉంది. ఈ కథ మొత్తం అమ్మమ్మగారి ఇంట్లోనే జరుగుతుంది. ఇందులో ముందుగా నటీనటుల గురించి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నాగశౌర్య ఇటువంటి సినిమాలో నటించలేదు. అమ్మమ్మగారిల్లు తను నటించిన పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం. నాగశౌర్య కథానాయకుడిగా చేయడం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. చాలా ఈజ్‌తో నాగశౌర్య తన నటనతో పాత్రలో ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్ కూడా బావుంది. షకలక శంకర్‌తో కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. చాలా ఏళ్ల తర్వాత షామిలి తెలుగులో హీరోయిన్గా నటించిన చిత్రమిది. హీరో మరదలి పాత్రలో షామిలి చక్కగా నటించింది. ఎమోషనల్ ట్రాక్‌లో రావు రమేశ్ నటన మెప్పిస్తుంది. ఆయన చేత పలికించిన డైలాగులు కూడా ఆకట్టుకుంటాయి. అమ్మమ్మ పాత్రలో నటించిన సుమిత్ర చెప్పిన ‘అమ్మ అయ్యి తప్పు చేశా. ఆస్తి అన్నా అయ్యుంటే అందరూ పంచుకునేవాళ్లు’ అనే డైలాగ్ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన శివాజీరాజా, సుధ, మధుమణి, హేమ, రవిప్రకాశ్, గౌతంరాజు, షకలక శంకర్ అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సుందర్ సూర్య సినిమాను అందంగా తీశాడు. కథని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో సఫలం అయ్యాడు. అయితే సినిమా సెకెండ్ ఆఫ్ స్లో పేజ్‌లో సాగడం ప్రేక్షకుడికి కొంత అసహనంగా అనిపిస్తుంది. భావోద్వేగాలు, కామెడీ ప్రేక్షకులకు నచ్చుతాయి. కల్యాణ రమణ సంగీతం, సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగున్నాయి. నిత్యం పని ఒత్తిడిలో ఉండేవాళ్లకు ఈ సినిమాలోని ‘లాక్ యువర్ ఏజ్’ ఉపయోగపడొచ్చు.
చివరిగా: వేసవి సెలవుల్లో ఒక్కసారైనా అమ్మమ్మగారింటికి వెళ్లాల్సిందే!
రేటింగ్: 3/5
Be the first to comment