ఒక అమిత్‌షా… ఇద్ద‌రు తెలుగు సీఎంల రియాక్ష‌న్‌

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్ని మొద‌ట నుంచి ద‌గ్గ‌ర‌గా చూడ‌ట‌మే కాదు.. వారి అప్ అండ్ డౌన్స్ లోనూ వారితోనే ఉన్న మీడియా అధినేత‌గా ఆంధ్ర‌జ్యోతి ఆర్కేకు పేరుంది. స్వ‌యంగా జ‌ర్న‌లిస్ట్ కావ‌టం.. వృత్తి ప‌ర‌మైన ద‌గ్గ‌ర‌త‌నంతో పాటు.. త‌న‌కున్న డ్రైవింగ్ ఫోర్స్ తో వారికి అత్యంత స‌న్నిహితుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. 
ఈ రోజున తెలుగు మీడియా వ‌ర‌కూ వ‌స్తే.. మీడియా మొఘ‌ల్ రామోజీతో పోలిస్తే..జ్యోతి ఆర్కేకే ఇద్ద‌రు చంద్రుళ్ల‌తో చ‌నువు ఉంటుంద‌ని చెబుతారు.
రామోజీ అంటే ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు గౌర‌వం.. మ‌ర్యాద లాంటివి ఉంటాయ‌ని.. ఈ కార‌ణంతో వారు కొన్ని అంశాల్ని మాత్ర‌మే ప్ర‌స్తావిస్తార‌ని.. ఇదే తీరులో రామోజీ కూడా త‌న హ‌ద్దుల్లోనే తాను ఉంటార‌ని చెబుతారు. ఇక‌.. రామోజీ కుమారుడు ఈనాడు ఎండీ కిర‌ణ్ పాత్ర అయితే ప‌రిమితంగా ఉంటుంద‌ట‌. స్వ‌త‌హాగా నెమ్మ‌ది స్వ‌భావం.. ఇత‌రుల హ‌ద్దుల్లోకి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని కిర‌ణ్ కు త‌న హ‌ద్దుల్లోకి ఎవ‌రైనా చొచ్చుకు వ‌స్తే అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతారు. ఈ కార‌ణంతోనే.. ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాలు.. గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో ఉంటారే త‌ప్పించి.. అంత‌కు మించిన అడుగు ముందుకు ప‌డ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
కానీ.. జ్యోతి రాధాకృష్ణ‌తో ఇద్ద‌రి ముఖ్య‌మంత్రుల సంబంధాలు వేరు.  చంద్రుళ్ల విష‌యంలో ఆర్కే చ‌నువు తీసుకుంటార‌ని చెబుతారు. అది త‌న‌కున్న హ‌క్కుతో కూడిన బాధ్య‌త‌గా భావిస్తార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఇద్ద‌రు చంద్రుళ్లు ఆర్కే విష‌యంలో కొన్ని ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇస్తుంటారు. చంద్రుళ్ల‌ను ద‌గ్గ‌ర‌గా చూడ‌ట‌మే కాదు.. త‌న ప‌త్రిక‌లో వారాంతంలో రాజ‌కీయ విశ్లేష‌ణ‌ను చేసే ఆర్కే.. ఈ సారి ఇద్ద‌రి చంద్రుళ్ల మ‌ధ్య ఉన్న తేడాను ప్ర‌స్తావించారు. ఇరువురి వ్య‌క్తిత్వంలోనూ.. త‌మ మీద విరుచుకుప‌డే వారి విష‌యంలో ఎలా స్పందిస్తార‌న్న‌ది చెప్పుకొచ్చారు. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ విష‌యాన్ని ఆయ‌న రాసిన అక్ష‌రాల్లోనే చూస్తే..
“అవినీతిపరుల అంతు చూస్తామని నిత్యం చెబుతున్న ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్న పార్టీకి అంతంత డబ్బు ఎలా, ఎవరు సమకూరుస్తున్నారన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అవినీతిపరుడిగా ముద్ర వేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబుపై విచారణ కోరతామని, చుక్కలు చూపిస్తామని స్థానిక బీజేపీ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయంలో కూడా ఒకరిద్దరు స్థానిక బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది”
“ఎన్నికలలో ఖర్చు చేయడానికి, పార్టీ నిర్వహణకు భారతీయ జనతా పార్టీకి నిధులు ఎలా వస్తున్నాయో తనకూ అలాగే వస్తున్నాయని కేసీఆర్‌ గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో స్థానిక బీజేపీ నాయకుల నోళ్లు మూతబడ్డాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కేసీఆర్‌లో ఉన్నంత తెంపరితనం లేదు. గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా రాష్ట్రానికి అంత ఇచ్చాం– ఇంత ఇచ్చాం అని చెప్పుకోవడంతో మండిపడ్డ కేసీఆర్‌, విలేకరుల సమావేశం పెట్టి మరీ అమిత్‌ షాను కడిగిపారేశారు”
“తాను అడిగిన ప్రశ్నలకు సంజాయిషీ ఇచ్చి మరీ తెలంగాణ పొలిమేరలు దాటాలని అమిత్‌ షాను కేసీఆర్‌ నిలదీశారు. దీంతో అమిత్‌ షా అటు తర్వాత గవర్నర్‌ నరసింహన్‌కు ఫోన్‌ చేసి ‘మీ ముఖ్యమంత్రికి నాపై అంత కోపం ఎందుకు?’ అని అడిగి తెలుసుకున్నారు”
“తాజాగా తిరుమల పర్యటనకు వచ్చిన అమిత్‌ షాకు తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక కార్యకర్తలు నిరసన తెలిపే క్రమంలో ఒకటి రెండు అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ సంఘటనను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వివరణల మీద వివరణలు ఇచ్చుకున్నారు. నిజానికి అమిత్‌ షా కుటుంబానికి గౌరవ మర్యాదలతో స్వామివారి దర్శనం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా స్థానిక బీజేపీ నాయకులు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించడానికే బీజేపీ నాయకులు తిరుమల ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.