చంద్రబాబు ఎఫెక్ట్.. పవన్‌కు షాకిచ్చిన అమిత్‌షా

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్.. కొద్దిరోజుల క్రితం ఉన్నట్లుండి ప్లేట్ ఫిరాయించారు. గుంటూరులో జరిగిన జనసేన నాలుగవ ఆవిర్భావ సభలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు, లోకేష్, ఇతర మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ప్రజా పోరాట యాత్ర పేరుతో బస్సు యాత్రను కూడా ప్రారంభించారు. అంత సవ్యంగానే సాగుతుందనుకున్న సమయంలో జనసేనానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు షాకిచ్చినట్లు తెలుస్తోంది.

తమ పార్టీపై వస్తున్న వ్యతిరేకతతో బీజేపీ నేతలకు భయం పట్టుకుంది. దీంతో గత ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పార్టీలు, వ్యక్తులను మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది మోదీ, అమిత్ షా ద్వయం. ఇందుకోసం సంప్కర్ ఫర్ సమర్థన్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శివసేన నాయకులతో చర్చలు జరిపిన షాకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ మరింత భయం పట్టుకుంది. ఇందు కోసమే అయిన వారిని, కానివారిని కలుస్తున్నారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే… అందరి మద్దతు తమకే ఉందని కలరింగ్ ఇవ్వడానికి ఇది పనికొస్తుందన్నది బీజేపీ నేతల భావన.

అందుకోసమే బీజేపీ బాస్ కలిసే పార్టీ అధినేతల పేర్లతో ఓ జాబితా తయారు చేసిందట పార్టీ అధిష్టానం. గతంలో తమ పార్టీతో కలిసి పని చేసిన కొంత మంది పేర్లు ఈ జాబితా నుంచి తొలగించారట. అందులో ఏపీకి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరనే టాక్ వినిపిస్తోంది.. ఒకప్పుడు పవన్‌ను ఆకాశానికి ఎత్తేసిన మోదీ, షా ద్వయం… ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. తాజాగా సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తనను కూడా కలుస్తారని పవన్ కూడా భావించారు. ఈ విషయాన్ని పవన్ సన్నిహితులు కూడా ధృవీకరించారు.

అంతేకాదు ఈ విషయంలో వారు మీడియాకు లీకులు కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అమిత్ షా త్వరలోనే హైదరాబాద్ వస్తారని, అప్పుడు పవన్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతారన్నది ఆ లీకుల వల్ల బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగి చాలా రోజులు అవడంతో అసలు షా కలిసే జాబితాలో పవన్ పేరుందో లేదో అని జనసేనకు సందేహం వచ్చింది. దీంతో కొందరు ఆరా తీయగా అందులో పవన్ పేరు లేదని బీజేపీ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలిస్తేనే పవన్‌తో చర్చలు జరపాలని బీజేపీ అధిష్టానం భావించిందట. అందుకే పవన్‌ను లైట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన తర్వాత చంద్రబాబు లేకపోతే పవన్ పరిస్థితి అంతే అని పలువురు అనుకుంటున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.