అసలు కారణం ఇదా.. కీలక ప్రకటన చేయనున్న ఆమంచి

2014లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకే సీట్లు వచ్చాయి. మరో పార్టీ అక్కడ విజయం సాధించలేదు. అని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ రెండు పార్టీలే కాకుండా ఇంకో పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచింది. అదే నవోదయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ విభజన అనంతరం ఆ పార్టీకి దూరమైన ఆమంచి కృష్ణ మోహన్ ఈ పార్టీ నుంచి గెలుపొందారు. ప్రకాంశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి నవోదయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి, టీడీపీ అభ్యర్థి పోతుల సునీతపై పది వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మారిన రాజకీయ సమీకరణల వల్ల ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున ఆమంచి భవిష్యత్ గురించి ఆలోచనలో పడ్డారని, ఈ క్రమంలోనే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశం అయిన తర్వాత ఆమంచి మనసు మార్చుకున్నారని, ఆయన టీడీపీలోనే కొనసాగేందుకు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామం తర్వాత తెలుగుదేశం పార్టీలోనే కాదు.. అందరిలో ఓ అనుమానం తలెత్తింది. తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్తలో యాక్టివ్ గానే ఉన్న ఆమంచి ఎందుకు అలక పాన్పు ఎక్కారు అని చాలా మందికి అనుమానం కలిగింది. అయితే, దీనికి సంబంధించి ఓ విషయం తాజాగా బయటికి వచ్చింది. గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి పోతుల సునీతకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడమే అసలు కారణమని సమాచారం. ఆమెను ఇటీవలే రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించారు. అంతకుముందు కూడా ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించారు. ఈ విషయాన్ని తనకు చెప్పకపోవడాన్ని ఆమంచి జీర్ణించుకోలేకపోయారట. అలాగే నియోజకవర్గంలో ఒకరిద్దరు వ్యక్తులు తనపైన తనతో ఉన్న పార్టీ నాయకులపైనా విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇవ్వటం గ్రామాలలో పార్టీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుండడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.

ఈ విషయాలను ఆయన జిల్లా పార్టీ దృష్టికి, జిల్లా మంత్రి రాఘవరావు, ఇన్‌చార్జ్‌ మంత్రి నారాయణ, ప్రత్యేకించి తమ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారని, కానీ అందరూ సమస్యను విన్నారే తప్ప ఏమాత్రం పరిష్కరించలేదని ఆమంచి కృష్ణమోహన్ కలత చెందారని విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో వైసీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా ఆ పార్టీలో చేరాలని భావించారట. అయితే, సీఎం జోక్యం చేసుకుని సమావేశమైన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని టీడీపీలోనే కొనసాగే విషయాన్ని, అందుకుగానూ సీఎం ఇచ్చిన హామీలను వివరించనున్నారని తెలిసింది. అలాగే ఇదే రోజు ఆయన తన భవిష్యత్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.