టీఆర్ఎస్‌కు షాకివ్వబోతున్న అల్లు అర్జున్ మామ

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రతీ పార్టీ ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే ఊహించని స్థాయిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా అదే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఖరారులో తల మునకలై ఉన్నాయి. అందుకోసం గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డాయి. ఇప్పుడు టీఆర్ఎస్ బాస్ చేసిన పనే ఆ పార్టీలో లుకలుకలకు కారణం అయింది. ఏ ఉద్దేశంతో కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారోగానీ, టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు.. ఒత్తిళ్ల తీవ్రతను పెంచారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా.. రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు సవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేయగా.. మరికొందరు నేతలు అదే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నేత వచ్చి చేరారు. గులాబీ బాస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయనే ప్రముఖ సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మామ(స్నేహారెడ్డి తండ్రి) కంచర్ల చంద్రశేఖర్ అలియాస్ శేఖర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలను నడుపుతున్న శేఖర్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆ పార్టీ నేతలకు దగ్గరయ్యారు. దీంతో అప్పటి ఎన్నికల్లో ఆయనకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. అయితే, ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. శేఖర్‌రెడ్డికి మాత్రం రెండో స్థానం కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు ప్రకటించిన జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. ఎన్నికల అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ మామ శేఖ‌ర్‌రెడ్డికి మొండిచెయ్యి చూపినట్టు అయ్యింది. దాంతో ఆయనలో అసంతృప్తి చెలరేగిందని, కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈయన గతంలో మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో శేఖర్ రెడ్డి వియ్యంకుడి బావ, కేంద్ర మంత్రి చిరంజీవితో పలుమార్లు సమావేశమై చర్చించారు. కానీ, అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.