దేశం’లో పొత్తులు, చేరికల జోరు

ఎన్నికల నేపధ్యంలో రెండు రాష్ట్రాల్లో వ్యూహాత్మక అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీఆర్‌ఎస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌లు బీజేపీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ చేరిన సంగతి విదితమే. ఇక ఆ పార్టీ నుంచి వలసలు ఉండవని భావించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొండ్రు మురళిని ఆకర్షించడంతోపాటు పాటు మాజీ ఎంపీ సబ్బం హరిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా తటస్థంగా ఉంటున్న సీనియర్ నేత మైసూరారెడ్డి కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం ఉంది. ఏపీలోపరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో ముందస్తును ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై ఆచితూచి అడుగేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారని సమాచారం.
తెలంగాణలో వామ పక్షాలతో పాటు ఉద్యమనేత కోదండరామ్ నేతృత్వంలోని ఫ్రంట్, ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై ఏపీ నేతలతో సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై పార్టీలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. కేసీఆర్- మోదీ సాన్నిహిత్యంపై టీడీపీ తెలంగాణలో ప్రచారం చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉందని, గట్టి పోరాటం ఇవ్వాలని చంద్రబాబు నేతలకు ఉద్భోదించారని సమాచారం. పొత్తులు, ఇతరత్రా వ్యవహారాలపై తెలంగాణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. విభజన తరువాత తెలంగాణ విషయంలో ఏనాడూ వ్యతిరేకతతో వ్యవహరించలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించినట్లు భోగట్టా. తెలంగాణను సాటి తెలుగు రాష్ట్రంగా అభివృద్ధి జరగాలనే దిశగానే వ్యవహరిస్తున్నామని బీజేపీ కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారనే అభిప్రాయం టీడీపీ నేతలలో వ్యక్తమవుతోంది. కాగా ఒంటరిగా ఎన్నికలకు చంద్రబాబు వెళ్లిన దాఖాలు ఎప్పుడూ లేవు.  ఎన్నికల సమయంలో ఎదో ఒక పక్షంతో జతకట్టి బాబు విజయం సాధిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనతో చేతులు కలపడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయనే కాంగ్రెస్ మీదే ఆధారపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తక్కువ సీట్లను తీసుకోవడానికి, ఏపీలో మెజారిటీ సీట్లను తీసుకునేందుకు ఒప్పందం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో కూడా తెలుగుదేశం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు నిచ్చింది. దీంతో కాంగ్రెస్, టీడీపీల మధ్యన దూరం  తగ్గినట్లుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక సీట్ల ఒప్పందం విషయానికి వస్తే తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లను ఆ పార్టీకే కేటాయించేందుకు కాంగ్రెస్ సమ్మతించిందని సమాచారం. ఇక ఏపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కొంతమంది సీనియర్లు ఉన్నారు. అలాంటి వారి సీట్లను తిరిగి కాంగ్రెస్ కు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోందని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.