జనసేనకు మాంచి స్ట్రోక్ ఇచ్చిన అఖిలప్రియ!

భూమా నాగిరెడ్డి వారసురాలిగా తండ్రి నీడలో ఎమ్మెల్యేగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీలో రాజకీయం చేయడం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి నెలకొందని గత కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. సొంత వర్గాన్ని, ముఖ్యంగా భూమా నాగిరెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డితో వైరం పెట్టుకున్న కారణంగా ఆమెకు సగం బలం తగ్గిపోయిందని తెలిసింది. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆమె అంతే దూకుడుగా వ్యవహరిస్తుండటం.. తరచూ పార్టీ మారబోతున్నారనే ప్రచారానికి కారణాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే టీడీపీ వీడి జనసేనాని గూటికి చేరనుందని పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై జనసేన పరువుపోయేలా భూమా అఖిలప్రియ స్పందించటం చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. 

జనసేనలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని తేల్చి చెప్పారు అఖిలప్రియ. ఏ పార్టీలో అవకాశం లేకపోవటం వల్ల తాను జనసేనలో చేరుతారన్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. తనకు అంత ఖర్మ పట్టలేదని చెప్పుకొచ్చారు. దీంతో అఖిలప్రియ ఘాటు స్పందన చూసి ఆమె రాజకీయ పరంగా అసలు జనసేనను ఓ పార్టీగా పరిగణించడం లేదని మాత్రం తేలిపోయిందంటున్నారు విశ్లేషకులు. అఖిలప్రియ తల్లిదండ్రులు చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు టీడీపీ పార్టీ వీడి అందులో చేరిపోయారు. అప్పట్లో ఆళ్లగడ్డ నుంచి ఆమె తల్లి శోభానాగిరెడ్డి గెలిచినా నంద్యాల పార్లమెంట్ నుంచి భూమా నాగిరెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో వారే కీలక పాత్ర పోషించారన్న ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. 

అయితే.. తన అనుచరుల ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేశారన్న కారణంగా అఖిలప్రియ.. తన గన్ మెన్లను వెనక్కి పంపారు. దీన్ని టీడీపీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ సెక్యూరిటీని వెనక్కి పంపడంతో.. ఆమె పార్టీ మారబోతున్నారని ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. మొదట ఆమె వైసీపీ గూటికి చేరనుందని వార్తలు పుట్టుకొచ్చి.. గత రెండు, మూడు రోజుల నుంచి మాత్రం ఆమె జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజాగా అఖిలప్రియ మాటలతో ఇదంతా ఓ మైండ్ గేమ్ అని తేలింది. ప్రస్తుతానికి టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసి తనపై వస్తున్న రూమర్లను తిప్పికోట్టింది అఖిలప్రియ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.