అజ్ఞాతవాసి సినిమా సమీక్ష

అజ్ఞాతవాసి సినిమా సమీక్ష
రేటింగ్ : 2.5/5
నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మన్యుయల్, ఆది పినిశెట్టి, బోమన్ ఇరానీ, కుష్బూ, రావూ రమేష్, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : రాధ కృష్ణ
సంగీతం : అనిరుధ్ రవి చందర్
 
పరిచయం : పవన్ కల్యాణ్ 25వ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వం.. ఇద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రం.. ఈ కారణాలు చాలు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి.. సినిమా క్లాప్ కొట్టింది మొదలు ఫాన్స్ లో ఎప్పుడు వెండితెరపై చూస్తామా ఆత్రంగా ఎదురుచుసారు.. అందుకే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా ఒకటేంటి అన్నిటిలోనూ రికార్డ్స్ సృష్టించారు.. మరి ఆ క్రేజీ సినిమా ప్రేక్షకుల మధ్యకు వచ్చినప్పుడు ఎలా ఉందో చూద్దామా..
 
కథ : ముందుగా అందరూ ఊహించిన విధంగానే ప్రతీకార నేపథ్యమున్న కథే..  పెద్ద ఫార్మా కంపెనీ అయినా ఏబీ గ్రూప్ ఛైర్మన్ బింద్రా (బోమన్ ఇరానీ), అతని కొడుకు హత్యకు గురవుతారు.. వారసులు లేని ఆ సంస్థకు పగ్గాలు ఎవరుచేపడతారు అనుకునే క్రమంలో బింద్రా భార్య ఇంద్రాణి(కుష్బు) సంస్థ వ్యవహరాలు చక్కదిద్దే పనిలో ఉంటుంది. అదే సమయంలో అస్సాంలో ఉంటున్న అభిజిత్ భార్గవ్(పవన్ కల్యాణ్)ని బాల సుబ్రహ్మణ్యంగా తెరపైకి ఇంద్రాణి తీసుకొస్తుంది. అసలు వారి హత్య ఎలా జరిగింది, కంపెనీ బాధ్యతలు ఎవరు చేపట్టాలి అనే అంశంపై జరిగే అన్వేషణలో జరిగే ఆసక్తి అంశాల సమాహారమే అజ్ఞాతవాసి సినిమా.. ఇందులో సీతారామ్(ఆది పినిశెట్టి) పాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా కీలకాశంగా సాగుతుంది. ముందగా ప్రచారంలో ఉన్నట్లుగానే ప్రెంఛ్ సినిమా లార్గో విన్చ్ చిత్రంలో మాతృకగా దీన్ని తెరకెక్కిచ్చారు. పతాక సన్నివేశంలోని టెర్రస్ పై ఫైట్ వంటి సన్నివేశాలు యథాతథంగా వాడుకున్నట్లు కనిపిస్తుంది…
 
విశ్లేషణ : పవన్ నట విశ్వరూపాన్ని మరోసారి తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు త్రివిక్రమ్.. ఆధ్యాంతం అన్ని తానై సినిమాని హీరో భుజాన వేసుకుని నడిపిస్తాడు. నటనలో పవన్ కొత్తగా కనిపిస్తాడు. ప్రతీకార నేపథ్యమున్న కథాంశం  పాతదే అయినా ట్రీట్ మెంట్ మాత్రం ట్రెండీగా చూపించే ప్రయత్నం చేశారు. టైటిల్స్ పడే సమయంలో విక్టరీ వెంకటేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినప్పుడు.. ఏదో చిన్న పాత్రలోనైనా కనిపిస్తాడు అని ఆశించిన అభిమానులకు నిరాశే మిగులుతుంది. కథ బలంగా రాసుకున్నా.. కథనం ప్రధమార్థం నుంచే మందకొడిగా సాగుతుంది.. అది పతాక సన్నవేశం వరకు మార్పు కనిపించదు.. మధ్యలో అసలు త్రివిక్రమేనా దర్శకుడు అనే సందేహం కలిగేలా సినిమా నడుస్తుంది. ఒక్క సన్నివేశం మిస్ అయినా కథ ఏం జరిగింది అని పక్కన వారిని అడిగినా అర్థం కాని తరహాలో కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. బీ, సీ సెంటర్ల వారికి కొన్ని డైలాగులు, సన్నివేశాలు అర్థం కాకపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఇద్దరు కథానాయకలు కీర్తి సురేష్, అను ఇమ్మన్యుయల్ కేవలం బుర్రలేని అందాల బొమ్మలుగానే దర్శనమిస్తారు. ఎటువంటి ప్రాధాన్యత లేకుండా.. కేవలం కొన్ని సన్నివేశాలకు, పాటలకు కావాలి కాబట్టి వారున్నారా అనిపిస్తుంది. డైలాగులు కొన్ని సినిమాలో చాలా బాగా పేల్తాయి.. అయినా త్రివిక్రమ్ నుంచి ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఎమోషన్ చూపించాల్సిన సన్నివేశాలు తేలిపోతాయి.. మొత్తం కథా భారాన్ని పవన్ మోసుకుని సినిమా ముందుకు సాగుతుంది.
 
సాంకేతికాంశాలు : సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా కనిపిస్తుంది. హీరో, హీరోయిన్లను అందంగా చూపించడంలోనూ, పాటల చిత్రీకరణలోనూ ఛాయాగ్రాహకుడి పనితనం స్పష్టంగా తెలుస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు ఊతాన్నిస్తుంది. రెగ్యులర్ పవన్ చిత్రాలకు భిన్నంగా సాగడం దీని ప్రత్యేకత.. పాటల లొకేషన్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. డబ్బుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు స్వేచ్ఛనిచ్చారని ప్రతి సన్నివేశం చెబుతుంది.
 
ప్లస్ పాయింట్స్ :
+ పవన్, ఆది, కుష్బూ, తనికెళ్ల భరణి నటన
+ అనిరుథ్ సంగీతం, కొన్ని పంచ్ డైలాగ్స్
+ కొడుకా కోటేశ్వరరావు పాట
 
మైనస్ పాయింట్స్ :
– కథనం, అర్థంకాని సన్నివేశాలు
– హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్
– ఎమోషన్స్ పండకపోవడం
– త్రివిక్రమ్ మార్క దర్శకత్వం లేకపోవడం
 
చివరగా…
గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రంలో చాలా రిచ్ గా కనిపించినా అంచనాలకు తగిన విధంగా లేకపోవడం ఫ్యాన్స్ కే కొంత అసంతృప్తి మిగులుస్తుంది. కేవలం ఏ సెంటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ, బీ, సీ సెంటర్లకు సంక్రాంతి పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. మొత్తం సినిమాని పవన్ స్లామినాతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓవరాల్ గా కలెక్షన్లకు డోకా లేకుండా పండక్కి పైసా వసూల్ సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు..
 
– ‘సినిమా ఊహాతీతం.. దట్స్ ద బ్యూటీ’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.