టీఆర్ఎస్‌ ఎంపీగా పోటీ చేయనున్న ప్రముఖ సినీ నటుడు

వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్ఎస్.. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అయితే, గతంతో పోల్చుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలపడడం, కోదండరాం పార్టీ పెట్టడం వంటివి టీఆర్ఎస్ నేతల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలలో తేలిందని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా ఈ మధ్య తెలంగాణలో టీఆర్ఎస్ కొంచెం ఆత్మరక్షణలో పడినట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్.. ఈ సారి వీలైనంత మంది కొత్త వారిని నిలబెట్టాలని చూస్తోందట.

ఇందులో భాగంగానే పలువురిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారట. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఎక్కవ దృష్టి సారించారట. ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై విశ్వాసంతో ఉన్న పలువురితో ఆ పార్టీ నేతలు ఇప్పటికే చర్చలు కూడా జరిపారట. ఈ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ సినీ నటుడు సుమన్‌దే. ఆయన కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానిస్తే.. టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని గతంలో సుమన్ ప్రకటించడంతో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అప్పట్లో దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు సుమన్.

‘‘ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని పార్టీలు తమ పార్టీలోకి రావల్సిందిగా అహ్వానించాయి. అయితే, 2018 తర్వాతనే రాజకీయాల్లోకి వస్తా’’ అని సుమన్ ఓ మీడియా ప్రతినిధితో అన్నారు. అయితే ఇటీవల ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రసంశల జల్లు కురిపించడం, ఆయనను కలిసి రావడం వంటివి చేశారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు అనే వార్తలకు బలం చేకూరింది. తాజాగా ఆయనను టీఆర్ఎస్ పార్టీలోని ఓ ముఖ్య నేత సంప్రదించారట. ఆ సందర్భంలో టీఆర్ఎస్‌లోకి రావడానికి తానెప్పటి నుంచో సిద్ధంగా ఉన్నానని సదరు నేతతో చెప్పారట సుమన్. అందుకు టీఆర్ఎస్ కూడా ఆయనకు ఓ ఆఫర్ ఇచ్చిందట.

సుమన్‌తో చర్చించిన టీఆర్ఎస్ ముఖ్య నేత ఆయన ఏం ఆశిస్తున్నారు అని ప్రశ్నించారట. ఇందుకు సుమన్ ప్రజాసేవ చేయడానికి ఏమైనా చేస్తా అని సమాధానమిచ్చారట. అందుకు ప్రజా ప్రతినిధినైతేనే ప్రజలతో మమేకం అవ్వచ్చని తాను భావిస్తున్నట్లు మనసులోని మాటను చెప్పారట. దీంతో ఆ నేత ‘‘సీఎం సార్ మిమ్మల్ని ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయించాలనుకుంటున్నారు. కొద్దిరోజుల్లో ఆ స్థానమేంటో చెబుతారు. దాని కోసం సిద్ధంగా ఉండండి’’ అన్నాడట. సదరు నేత మాట ప్రకారం సుమన్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారట. ఈ పర్యటనలో ప్రజల మనోగతం తెలుసుకుంటున్నారట. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. తిరిగి వచ్చిన తర్వాత సుమన్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.