అభిమన్యుడు మూవీ రివ్యూ

విడుదల తేది…01.06.2018

నిర్మాణ సంస్థ‌లు: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, హ‌రి వెంక‌టేశ్వ‌ర పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ త‌దిత‌రులు
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌
కూర్పు: రూబెన్స్‌
క‌ళ‌: ఉమేశ్ కుమార్‌
మాట‌లు: రాజేశ్ ఎ.మూర్తి
నిర్మాత‌: జి.హ‌రి
ద‌ర్శ‌క‌త్వం: పి.ఎస్‌.మిత్ర‌న్‌

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయిపోయింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు పుట్టుకొచ్చేస్తున్నాయి. టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతోందో.. అంతే చెడు కూడా జరుగుతోంది. ఈ కోణం నుంచే డైరెక్టర్ మిత్రన్ తన స్టోరీని రెడీ చేశాడు. టెక్నాలజీని దుర్వినియోగం చేసేవాళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను జాగ్రత్తగా వాడకపోతే ఎలాంటి పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేసే చిత్రమే ‘అభిమన్యుడు’.

పందెంకోడి సినిమాతో తెలుగువాళ్లకు హీరోగా పరిచయం అయిన విశాల్.. అటు మాస్ సినిమాల‌తో పాటు.. ఇటు వైవిధ్య‌మైన క‌థ‌లు కూడా చేస్తున్నాడు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ అలరించిన సీనియర్ హీరో అర్జున్.. ఇప్పుడు తండ్రి పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ‘అభిమన్యుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిజిట‌ల్ ఇండియాలోని మ‌రో కోణాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా ఎలా ఉంది?.. స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క‌థ‌:
క‌రుణాక‌ర్‌(విశాల్‌).. ఓ ఆర్మీ మేజ‌ర్‌. నిజాయ‌తీ గ‌ల ఆఫీస‌ర్‌. కోపం ఎక్కువ. కళ్ల ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు.. ఎదురు తిరుగుతుంటాడు. అతడికి కోపం ఎక్కువ కావ‌డంతో ఆర్మీ అత‌న్ని ఓ సైక్రియాటిస్ట్ ద‌గ్గ‌రికి పంపుతుంది. ఆరు వారాల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుని సర్టిఫై అయి వ‌స్తేనే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చని ఓ కండిష‌న్ పెడుతుంది. తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసం సైక్రియాటిస్ట్ ల‌తాదేవి(స‌మంత‌) వద్దకు వెళతాడు క‌రుణాక‌ర్. తన తండ్రి చేసిన మితిమీరిన అప్పుల వల్లే తన తల్లి చనిపోయిందని భావించి చిన్నప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటాడు. తండ్రి మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని కరుణాకర్‌ను తన సొంత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వస్తేనే సర్టిఫికెట్‌పై సంతకం పెడతానని సైక్రియాటిస్ట్ లతాదేవి కండీషన్ పెడుతుంది. లతాదేవి చెప్పినట్లే కరుణాకర్ తన సొంతూరుకు వెళతాడు. తన ఒక్కగానొక్క చెల్లికి పెళ్లి చేయడానికి డబ్బులు సిద్ధం చేస్తాడు. స్థలం అమ్మగా వచ్చిన 4 లక్షలకు తోడు మరో 6 లక్షలు లోన్ తీసుకుని మొత్తం డబ్బును తన తండ్రి ఖాతాలో జమ చేస్తాడు. రేషన్ కార్డు తప్ప ఏటీఎం కార్డు గురించి తెలియని తన తండ్రికి ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీయాలో నేర్పిస్తారు. అకౌంట్‌లో ఉన్న మొత్తం రూ. 10 లక్షల నుంచి ఖర్చుల కోసం పాతికవేలు విత్‌డ్రా చేస్తారు. అనంతరం మరికొంత డబ్బు కోసం ఏటీఎంకు వెళితే అకౌంట్‌లో డబ్బులు లేవని తెలుస్తుంది. ఆ డబ్బు మొత్తం ఏమైంది? తమ ప్రమేయం లేకుండా ఎవరు తీశారు? అనే దానిపై మిగతా కథ నడుస్తుంది.

నటీనటుల పనితీరు:
విశాల్ ఎప్ప‌టిలా త‌న న‌ట‌న‌తో, ఫైట్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇలాంటి డిఫ‌రెంట్ చిత్రాన్ని ఎంచుకున్నందుకు హీరోగా, నిర్మాత‌గా విశాల్‌ను అభినందించాల్సిందే. ఇక స‌మంత పాత్ర చాలా తక్కువ. పెళ్లి తర్వాత కూడా గ్లామర్‌గా కనిపిస్తూ పాటల్లో ఆకట్టుంది. నటనకు పెద్దగా ప్రాధాన్యంలేని పాత్ర‌లో స‌మంత న‌టించింది. ఇక విల‌న్‌గా న‌టించిన అర్జున్‌.. వైట్ డెవిల్‌గా మెప్పించాడు. ఆయ‌న న‌ట‌నతో వైట్ డెవిల్ అనే పాత్ర‌కు ప్రాణం పోశాడు. విశాల్ తండ్రిగా న‌టించిన ఢిల్లీ గ‌ణేశ్ త‌ప్ప‌.. సినిమాలో న‌టించిన వారంతా.. త‌మిళ‌ న‌టీనటులే. జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రూబెన్స్ ఎడిటింగ్‌, యువన్ సంగీతం క‌థ‌ను ఆడియెన్‌కు క‌నెక్ట్ చేయ‌డంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

విశ్లేష‌ణ‌:
ఒకప్పుడు డబ్బులు విత్‌డ్రా చేయాలంటే చచ్చినట్టు బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు ఏటీఎంలు వచ్చేశాయి. అంతా ఆన్‌లైన్ అయిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ నుంచే అన్ని లావాదేవీలు చేసేయొచ్చు. సమయం కలిసిరావడం, ప్రక్రియ కూడా సులువుగా ఉండడంతో జనాలంతా ఆన్‌లైన్‌కే అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మన డేటా మిస్ యూజ్ అయితే.. మన మాటలను ఇతరులు గుట్టుచప్పుడుగా వింటే… మన కదలికలను ప్రతిక్షణం గమనిస్తే… తలుచుకుంటేనే భయం వేస్తుంది. సైబర్ క్రైమ్‌ల గురించి ఇప్పటికే న్యూస్‌లో కూడా చూసుంటారు. ఫ్రీ గిఫ్ట్‌ల పేరిట, ఆఫర్ల పేరిట ఎంతో మంది అమాయకులను మోసం చేసి వాళ్ల అకౌంట్లలో ఉన్న డబ్బులను కొట్టేసే సైబర్ నేరగాళ్ల గురించి వినే ఉంటారు. లోన్ల పేరిట బ్యాంకుల్లో జరిగే మోసాల గురించి చదివుంటారు. ఈ సినిమాలో అంతకు మించిన సైబర్ నేరాన్ని డైరెక్టర్ చక్కగా ప్రజెంట్ చేశాడు. టెక్నాలజీ వాడుక విషయంలో మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. అయితే ఈ సినిమాలో చూపించినంతగా ఇప్పుడు జరగకపోయినా భవిష్యత్తులో జరగబోదన్న గ్యారెంటీ కూడా లేదు. హ్యాకర్లు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఎవరికీ తెలియదు.

ప్రస్తుతం మనదేశంలో డిజిట‌ల్ ఇండియా అనే పదం విపరీతంగా వినిపిస్తోంది. నోట్ల రద్దు తర్వాత క్యాష్‌లెస్ ఇండియా అనే కొత్త కాన్సెప్ట్‌ను కూడా తీసుకొచ్చారు. అన్నింటికీ ఆధార్ కార్డ్‌నే ఆధారంగా చేసేశారు. అవసరం ఉన్నాలేకపోయినా ప్రతిఒక్కదానికీ ఆధార్‌ను లింక్ చేయ‌మ‌ని అంటున్నారు. టెక్నాలజీ పెరుగుతుంది ఓకే.. కానీ దాని వ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను మ‌న‌కు తెలియ‌కుండా మ‌న స్మార్ట్‌ఫోన్ ద్వారా ప‌క్క‌వాడికి మ‌నమే ఇచ్చేస్తున్నాం. ఒక యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే వాడు పెట్టే కండీషన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏదైనా ఆఫర్ అని కనిపించగానే క్లిక్ చేసేస్తుంటాం. అలాంటి టైమ్‌లో హ్యాకర్లు మన స్మార్ట్‌ఫోన్లపై దాడి చేస్తారు. మన‌కు తెలియ‌కుండా మ‌న వివ‌రాల‌న్నింటినీ హ్యాక‌ర్లు దొంగిలించేస్తారు. ఆధార్ కార్డ్ కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ మాత్ర‌మే కాదు.. అందులో మ‌న ఫింగర్‌ప్రింట్స్, ఐరిష్ తదితర స్కాన్ వివ‌రాలన్నీ ఉంటాయి. అలాంటి బ‌ల‌మైన మ‌న ఆధారం వేరెవడి చేతికో వెళితే ఏమవుతుంది? అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది స్మార్ట్‌ఫోన్ల వినియోగం విషయంలో జాగ్రత్త వహిస్తారు.

అభిమన్యుడు.. డిజిటల్ ఇండియాకి అవసరమైన సైనికుడు

రేటింగ్‌: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.