అక్కడ 42 మంది అభ్యర్థులు

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అది. అందుకే అది ఎంతో ప్రత్యేకమైనది. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల వల్ల ఆ నియోజకవర్గం మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా.. ఈ స్థానం పేరు మారుమ్రోగిపోవడానికి కారణం అక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులే. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదనేగా మీ సందేహం..? అదే గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి. తెలంగాణలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడినప్పటి నుంచి ఏదో ఒక విశేషం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుడు ఈ నియోజకవర్గం కూడా అదే స్థాయిలో హైలైట్ అవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ విజయం సాధించింది. 2014లో జరిగిన ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌‌రావుపై 2,678 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సి. కనకారెడ్డి గెలుపొందారు. కానీ, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

అప్పటి ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావుకు సీటు కేటాయించారు. అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్. రాంచందర్‌ రావ్, టీజేఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్‌‌ పోటీ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. మల్కాజిగిరి నుంచి ఈ ఎన్నికల్లో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే టాప్. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పట్నుంచి వందల మంది నామినేషన్లు వేయడం.. ఆ తర్వాత కొందరు విత్‌‌డ్రాలు చేసుకున్నప్పటికీ ఆఖరికి రెండంకల సంఖ్యలో మిగిలిపోతున్నారు. మల్కాజ్‌గిరి మొదటి స్థానంలో ఉండగా.. ఎల్బీనగర్‌, ఉప్పల్‌లలో 35 మంది వంతున పోటీలో ఉన్నారు. ఖైరతాబాద్‌లో 32, అంబర్‌పేటలో 31 మంది పోటీ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఓటర్లు ఆశ్చర్యపోతున్నారట. ఇలా ఎక్కువ మంది బరిలో ఉండటంతో ఓటర్లు చాలా కన్ఫూజన్‌‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది..? ఎవరికి మైనస్ అవుతుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.