‘24 కిస్సెస్’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
న‌టీనటులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు
మ్యూజిక్: జోయ్ బారువా
సినిమాటోగ్రఫీ: ఉద‌య్ గుర్రాల‌
బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ పిలిప్‌
ఎడిటింగ్: ఆల‌యం అనిల్‌
ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్ కృష్ణం శెట్టి

అచ్చమైన ప్రేమ కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. అయితే, అలాంటి సినిమాల్లో కూడా రొమాన్స్ జోడించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. అందుకే లవ్ స్టోరీల్లో లిప్‌లాక్‌లు జోడిస్తున్నారు ఇప్పటి దర్శకులు. ఒక్క కిస్ సీన్‌‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఒకే సినిమాలో 24 కిస్‌ సీన్స్ పెడితే.. అదే ‘24 కిస్సెస్’. ‘మిణుగురులు’తో త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్న అయోధ్య‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావ‌డం.. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..?

కథ
ఆనంద్ (అరుణ్ అదిత్‌) చిన్న పిల్ల‌ల చిత్రాలు తీసే ద‌ర్శ‌కుడు. మానవ సంబంధాలంటే న‌మ్మ‌కం లేని వ్య‌క్తిత్వం అతనిది. అలాంటిది చిన్న పిల్లలంటే ఇష్టంతో సినిమాలు తీసి ఫండ్ రైజింగ్ చేస్తుంటాడు. అనుకోకుండా మాస్ క‌మ్యూనికేష‌న్ చదువుతున్న శ్రీల‌క్ష్మి (హెబ్బా ప‌టేల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శ్రీల‌క్ష్మి అది ప్రేమే అంటుంది. ఆనంద్ మాత్రం ప్రేమ కాదంటాడు. అప్పుడు శ్రీలక్ష్మీకి 24 కిస్సెస్ థియరీ గురించి తెలుస్తుంది. దీని ప్రకారం 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోదని ఆమె నమ్ముతుంది. అప్పటి నుంచి ఆనంద్‌కు ముద్దులు పెట్టడం మొదలుపెడుతుంది. అంతలోనే ఆనంద్ గురించి శ్రీలక్ష్మికి ఒక నిజం తెలుస్తుంది. దాంతో అతడికి దూరంగా వెళ్లిపోతుంది. ఇంతకీ ఆమె ఆనంద్‌కు 24 ముద్దులు పెట్టిందా..? అసలు ఆనంద్‌ గురించి శ్రీలక్ష్మికి తెలిసిన నిజం ఏంటి..? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా.. లేదా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
అవార్డ్ విన్నర్ అయోధ్య కుమార్ తెరకెక్కించిన ఈ ‘24కిస్సెస్’ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాను క్యాచీ టైటిల్ అయితే పెట్టారుగానీ, ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా కథ, కథనం రాసుకోలేకపోయాడు దర్శకుడు. అనవసరమైన రోమాన్స్, బలమైన ఎమోషన్స్ కామెడీ లేకపోవడం సినిమాను చాలా బోరింగ్‌గా మార్చేశాయి. చివరగా ఈ చిత్రానికి ప్రేమికులు ఏమైనా కనెక్ట్ అవుతారేమో కానీ ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కష్టమే.

నటీనటుల పనితీరు
ఆనంద్ పాత్రలో నటించిన ఆదిత్ అరుణ్ ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. నటనాపరంగా అలాగే లుక్స్ పరంగా కూడా మెప్పించాడు. శ్రీలక్ష్మి పాత్రలో నటించిన హెబ్బా గత సినిమాల్లో కంటే గ్లామర్‌గా కనిపించి తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మూర్తి పాత్రలో నటించిన రావు రమేష్, హెబ్బా తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ తమ పాత్రలను ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
‘మిణుగురులు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్.. ఈ సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. కిస్సుల మీద పెట్టిన శ్రద్ధ.. కథ, కథనంపై పెట్టలేదనిపిస్తుంది. మొత్తంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకేపోయాడేమో. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని అందించిన ఉదయ్ గుర్రాల సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. జాయ్ బారువా సంగీతం అక్కటుకునేలా లేదు. లో బడ్జెట్‌లో సినిమాను నిర్మించిన సంజయ్ రెడ్డి సినిమాకు ఎంత అవసరమో అంత మేరకే ఖర్చు పెట్టారు .

బలాలు
* నటీనటులు
* రొమాన్స్

బలహీనతలు
* కథ, కథనం
* సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు
* మ్యూజిక్
* సాగదీత

మొత్తంగా: ‘24 కిస్సెస్’ పేరుకే మేటర్ లేదు

రేటింగ్: 1.75/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.