మరో వివాదంలో వర్మ.. నాగ్ కాపాడుతారా?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన స్ర్కిఫ్ట్స్‌తో సినిమాలు తీస్తూ తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ జయకుమార్ అనే రచయిత వర్మపై పోరాటానికి సిద్ధం అయ్యాడు. పలు కథల విషయంలో ఇంతకు ముందే వర్మపై కేసు కూడా ఫైల్ చేయించిన జయకుమార్.. వర్మ తాజా చిత్రం ‘ఆఫీసర్’ కథ కూడా తనదేనంటూ మీడియాకి ఓ లేఖని విడుదల చేశారు. ఆ లేఖ యథాతథంగా..

‘‘నా పేరు పి. జయ కుమార్. అమితాబ్ బచ్చన్ గారు నటించిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “సర్కార్ 3” చిత్రం ద్వారా నేను రచయితగా పరిచయం అయ్యాను. రచయిత అవ్వాలనే నిర్ణయం తీసుకొని ప్రయత్నిస్తున్న రోజుల్లో నేను రామ్ గోపాల్ వర్మను మొదటిసారిగా 2015 లో కలిశాను. 2015 జనవరి లో, “ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఛీప్ ఆఫీసర్ ఇంకొక కరెప్టడ్ పోలీస్ ఆఫీసర్‌ని ఇన్వెస్టిగేట్ చేసే థీమ్‌ని బేస్ చేసుకొని నేను డెవలప్ చేసుకున్న ఒక ఐడియాని వర్మ గారికి నేరేట్ చేసాను. ఆయన నా కథకి గొప్ప ఆసక్తిని చూపించారు. నేను ఫిబ్రవరి 3, 2015 తేదీన ఇమెయిల్ ద్వారా ఈ కథకి సంబంధించిన స్ర్కిఫ్ట్ ని పంపించాను. నా కథ నచ్చి వర్మగారు అనేక రివిజన్స్, రిరైట్స్, ఎడిట్స్ కోరారు. నా ఫైనల్ డ్రాఫ్ట్‌ని ఇమెయిల్ చేశాను. వర్మ దానికి ప్రతిస్పందించి, నన్ను మరిన్ని సవరణలు చేయమని కోరారు. అలా చాలా ఇమెయిల్స్ తర్వాత మే 29, 2016 న వర్మగారికి నేను ఫైనల్ డ్రాఫ్ట్‌ని పంపించాను.

రామ్ గోపాల్ వర్మ గారు ఇమెయిల్స్ ‌లో నా అసలు స్ర్కిఫ్ట్‌కి కోరిన అనేక రివిజన్స్, రిరైట్స్, ఎడిట్స్‌లో స్లగ్ లైన్స్, డైలాగ్స్, డిస్ర్కిప్షన్స్, స్ర్కీన్‌ప్లే మరియు ఇతర అంశాలు సృష్టించడం కోసం అన్ని సృజనాత్మక లైసెన్సులు నాకు కేటాయిస్తూ.. స్క్రిప్ట్ లోని ఐడియాస్, సీన్స్ నావే అని గుర్తించాడు. స్ర్కిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్ ప్రొడక్షన్ మొదలు పెట్టినప్పుడు నాకు ఇంటిమేట్ చేసి కంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తా అని వర్మగారు హామీ ఇచ్చారు కానీ తర్వాత ఎప్పుడూ నన్ను ఏమాత్రం సంప్రదించలేదు.

‘ఆఫీసర్’ స్ర్కిఫ్ట్ రచన కోసం పని చేస్తున్న రోజుల్లో ఆయనకి నేను నా మరో 9 స్ర్కిఫ్ట్స్ షేర్ చేయడం జరిగింది. అందులో ఒకటే అమితాబ్ బచ్చన్ గారు నటించిన సర్కార్ 3. ఆ సినిమా ముగిసిన తర్వాత, నేను వర్మతో ఉన్న బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మూలాన ఆయన నుంచి దూరంగా వెళ్లి పని చేసుకోవడం మొదలు పెట్టాను. తర్వాత ఆయన నా ఒక్కొక్క స్ర్కిఫ్ట్‌ని నాకు క్రెడిట్ ఇవ్వకుండా సినిమాలు చెయ్యడం మొదలు పెట్టారు. అలా ఆయన కాపీ కొట్టి తీసిన మరో ప్రాజెక్ట్ మీద ఇప్పటికే సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్ లో నేను వర్మ మీద ఒక కేస్ వెయ్యడం జరిగింది. కేస్ డిటైల్స్: ఓ.ఎస్. నెం. 60 of 2018.

ఇదిలా ఉండగా వర్మ గారు ఇటీవలే నాగార్జున నటించిన “ఆఫీసర్” సినిమాకి సంబంధించిన రెండు ఆఫీషియల్ టీజర్లను, ట్రైలర్‌ని తన ఆఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేశారు. వాటిలోని సంభాషణలు మరియు సన్నివేశాలు నా స్ర్కిఫ్ట్ లోవి అయ్యి ఉండడం చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఆయన తీసిన “ఆఫీసర్” సినిమా నా స్క్రిప్ట్ యొక్క గుడ్డి కార్బన్ కాపీ.

ఆయన నా స్క్రిప్ట్ మీద ఆసక్తిని చూపించకపోవడం వల్ల ఆ సినిమాని నేనే స్వతంత్రంగా డైరెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటే ఆయన దాన్ని కాపీ కొట్టడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నాకు 27 ఏళ్లు సర్. నేను కెరియర్‌ని ఇపుడిపుడే ఆశాజనకంగా బిల్డ్ చేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు మరియు నిర్మాత అయిన వర్మ గారు నా అనుమతి లేకుండా నా స్క్రిప్ట్‌ని ఉపయోగించడం ద్వారా నా హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, నా సినిమా యొక్క భవిష్యత్తును కూడా దెబ్బతీశాడు. యువ రచయితల శ్రమని ఇలా వాడుకుంటున్న వాళ్ళని కట్టడి చేసే, డిసిప్లెన్ తెచ్చే శక్తి మీడియాకి ఉందని నేను నమ్ముతున్నాను.

కావున దయచేసి గౌరవనీయులైన చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నా బాధను, పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నాను.

నమస్కారాలు.
ఇట్లు,
పి. జయకుమార్’’

అంటూ పోస్ట్ పెట్టిన జయకుమార్ మరో పోస్ట్‌లో తనకు న్యాయం చేయాలంటూ నాగార్జునను వేడుకున్నాడు. ‘‘నాగార్జున గారు, నాకు జరిగిన మోసం గురించి మీకు చెప్పి న్యాయం కోరడానికి శతవిధాలా ట్రై చేశాను. కానీ నా స్క్రిప్ట్‌ను కాపీ కొట్టిన మీ డైరెక్టర్ నుంచి, సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ దాకా అందరూ నా దారులన్నీ మూసేసారు.’’ అని తన పరిస్థితి వివరించాడు జయకుమార్. మరి దీనిపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*