పవన్ కల్యాణ్ అదే పంథా

నాలుగు రోజులుగా తిరుపతిలో మకాం వేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై విరుచుకుపడటం వ్యూహంలో భాగమే. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందనే తరహాలో మాట్లాడారు పవన్. అంతేకాదు… ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినవారే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారని ప్రస్తావించారు. అసలు ప్రభుత్వాలకు మానవతా దృష్టి లేదని ఆరోపించడం మరింత హాట్ టాపికైంది. రోడ్డు విస్తరణకు భూములు తీసుకున్న తర్వాత పరిహారం ఎందుకు చెల్లించరని ఆయన ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ హామీని ఇప్పటికీ సరిగా అమలు చేయలేదని పవన్ ఆరోపించారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అది చేయలేదన్నారు. ఫలితంగా అసలు టీడీపీ సర్కార్ కు  చిత్తశుద్ది లేదని ప్రస్తావించారు. 
తిరుమలలో రాజకీయాలు వద్దని చెప్పిన ఆయన అక్కడ అదే మాటలు చెప్పారు. టీడీపీ విషయంలో పవన్ కల్యాణ్ స్టాండ్ మారలేదు. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారాయన. వీలున్నంతగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అదే చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ తాజాగా.. టీడీపీ సర్కార్ పైనా అలాంటి మాటలే మాట్లాడారు. టీడీపీకి మద్దతునిస్తేనే పనులు చేస్తారు. లేకపోతే అసలు ఎవరినీ పట్టించుకోరని చెప్పారు. ఫలితంగా టీడీపీ, జనసేన మధ్య మరింత దూరం పెరిగిందని అర్థమవుతోంది. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా టీడీపీ పట్టించుకోవడం మానేసింది. అతను ఒక పార్టీ నేత.. అంతకు మినహా ఏం లేదనే రీతిలోనే టీడీపీ ఉంది. ఫలితంగా తనకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత దక్కడం లేదని పవన్ భావిస్తున్నారు. ఆ విషయంలో తన మనసులోని మాటను వెళ్లగక్కారు. 
గతంలో అంటే టీడీపీలో భాగస్వామ్యంగా ఉండేది కాబట్టి టీడీపీ శ్రేణులు ఆయన్ను తమ నేతగా చూశాయి. ఇప్పుడు కాదు. అందుకే ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. తిరుపతిలో ఆయన నాలుగు రోజులు ఉన్నా.. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవానికి ఇబ్బంది కలిగించలేదు. కానీ గతంలో ఇచ్చిన ప్రయార్టీ లేదనేది వాస్తవం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*