నేను అధికారంలోకి వస్తే రిటైర్మెంట్ లేకుండా చేస్తా: జగన్

టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్‌లో ఆరోపించారు. అర్చకులకి పదవీవిరమణ ప్రకటించడం సరైందని కాదని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వెల్లడించిన విషయాలతో చంద్రబాబు ధనయావ, అధికార దాహం మరోసారి వెల్లడైందని జగన్ విమర్శించారు. అనువంశిక సేవకులుగా స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వర్తించే హక్కు శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుందని జగన్ చెప్పారు.

పదోన్నతితో కూడిన పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడం అర్థం లేని చర్య అని జగన్ పేర్కొన్నారు. దేవుని మీద భయం, భక్తి లేనివారు కాబట్టే గుడిభూములను కాజేయాలని చూశారన్నారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారని విమర్శించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తాను అధికారంలోకి వస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అర్చకుల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని జగన్ స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*