లెక్కలేని తనమే ప్రమాదానికి కారణమైంది…

సరంగు లెక్కలేని తనమే గోదావరి నదిలో లాంచీ మునకకు దారి తీసింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, చెప్పినా వినక పోవడంతో చాలా మందిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రయాణీకుల మాటలు సరంగు విని ముందే ఒడ్డుకు చేరిస్తే ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఆపని చేయకుండా ముందుకు వెళ్లడం, సిమెంట్ బస్తాలు తడుస్తాయని కిటికీలు వేయడంతో లాంచీ కుదుపుకు గురైంది. ఒకవైపుకు ఒరిగి పోయింది. ఆ సమయంలో కిటికీలు తీసినా కొందరు బయటకు కొట్టుకుంటూ వచ్చేవాళ్లు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలుసుకోవడం కష్టంగా మారింది. పైన ఉన్న వారు ఎలాగు కిందకు దూకారు 15 మంది వరకు ప్రాణాలు కాపాడుకున్నారు. 
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో లాంచీ గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కావడం లేదు. లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కొండమొదలు మధ్య మంటూరు ఎగువ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న లాంచీ ఈదురు గాలుల తాకిడికి గురైంది. ముందుకు వద్దని చెప్పిన సరంగు వినకపోవడమే ఇందుకు కారణం. ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 55మంది ఉండగా.. వారిలో 40 మంది జలసమాధి అయ్యారు. అంతా అయిపోయాక చేతులు పట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. లాంచీ నడిపే వారికి ప్రజల ప్రాణాలపై మమకారం లేకపోవడం.. ఆ.. ఏముందిలే అనే నిర్లక్ష్యం మొత్తం ప్రమాదానికి దారి తీసింది. లైప్ జాకెట్లు ఉన్నా.. వాటిని కట్టగట్టి పక్కన పడేశారు. వాటిని తెరిచే సాహసం చేయలేదు. ఫలితంగా చాలా మంది ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. నేవీ ప్రత్యేక సహాయక బృందంతో పాటు బోటు మునిగిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ళు గాలింపు చేస్తున్నారు. నేవల్‌ డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 
ఇలాంటి విపత్తు, ప్రమాద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా చర్చలు తీసుకుంటారు. ఇప్పుడు అదే పని చేసారు. బోటు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. గాలింపు, సహాయక చర్యల గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 
స్వయంగా ఆయనే రంగంలోకి దిగి బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే అంశం పైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు విపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ లు ప్రమాద ఘటనపై స్పందించారు. తమ పార్టీ నేతలు రంగంలోకి దిగి బాధితులకు అండగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు ఇప్పుడు అదే పని చేస్తున్నాయి. చనిపోయిన వారంతా పేదలు, కూలీలు, వ్యవసాయ కార్మికులు కావడంతో ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*