సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎడ్యూరప్ప

కర్నాటకలో సిఎం పీఠంపై మరోసారి కూర్చోనున్నారు ఎడ్యూరప్ప. ఇందుకు రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. విడిగా పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, జేడీఎస్ లను కాదని బీజేపీకి అవకాశం ఇచ్చారు గవర్నర్. మరోవైపు ఎమ్మెల్యేల బేరాలు అయిపోయినట్లు తెలుస్తోంది. జేడీఎస్ కు చెందిన రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు గౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు వారితో టచ్ లో ఉన్నారు. జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి వారు రాలేదు. వారే కాదు..కాంగ్రెస్ పార్టీకి చెందిన హైదరాబాద్‌ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్‌, నాగేంద్ర, రాజశేఖర పాటిల్‌ లు అధిష్టానంతో టచ్‌లో లేరు. అది కాంగ్రెస్ లోని హాట్ టాపికైంది. వారు ముగ్గురు గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు సన్నిహితులు అని తెలుస్తోంది. బీజేపీ నేత శ్రీరాములుకు వీరు బంధువులు కావడంతో.. ఆయన దగ్గరుండి వారి సంగతి చూసుకుంటున్నారట. 
కమలం నేతల ఎర
వారే కాదు…ఐదుగురు లింగాయత్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నేత యడ్యూరప్పతో రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. బీజేపీకి కావాల్సిందే 9 సీట్లు. కానీ ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఎడ్యూరప్ప సిఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గ్యారెంటీ. పార్టీలో చేరే వారికి మంత్రి పదవితో పాటు..తాయిలాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారంటున్నారు. బీజేపీ మైండ్‌గేమ్‌ లో వారు పావులుగా మారుతున్నారని అర్థమవుతోంది. 
అనైతిక చర్యల ద్వారా ఎమ్మెల్యేలు ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ అధిష్టాన దూత గులాంనబీ ఆజాద్‌ నిప్పులు చెరుగుతున్నారు. అధికారం కైవసం చేసుకునేందుకు ఆజాద్…కుమారస్వామితో మంతనాలు చేయడం అనైతిక కిందకు రాదట. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకుని పోవడం మంచిది కాదంటున్నారాయన. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడినా.. తమ ఎమ్మెల్యేలపై విశ్వాసముందని, ఎవరూ బీజేపీ గూటికి చేరబోరని కాంగ్రెస్ పైకి గంభీరంగా చెబుతోంది. 
క్యాంప్ రాజకీయాలు చేస్తున్న హస్తం పార్టీ నేతలు
బెంగళూరులోని ఈగల్టన్‌ హోటల్లో 150 గదులు బుక్‌ చేసి.. తమ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించాలని కాంగ్రెస్, జేడీఎస్ లు భావిస్తున్నాయి. అయినా సరే కొందరు ఇందుకు వ్యతిరేకిస్తున్నారట. కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు అంతా హాజరుకాకపోవడంతో కాంగ్రెస్ కు గుబులు పట్టుకుంది. ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 10 మంది డుమ్మాకొట్టారు.  78 సీట్లను కాంగ్రెస్ గెలుచుకున్నా..ఎంత మంది పార్టీలో ఉంటారో అనే సందిగ్దత నెలకుంది. మరోవైపు కాంగ్రెస్ రెబల్స్ గా గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లను తమవైపు కు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. 222 స్థానాలలో ఇండిపెండెంట్‌లు కేవలం 2 నియోజకవర్గాలలో మాత్రమే గెలిచారు. కోలారు జిల్లా ముళబాగిలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హెచ్‌.నాగేశ్‌కు ఎన్నికలలో కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. అతను ఇప్పుడు బెంగళూరులోని కాంగ్రెస్ క్యాంప్ కు చేరారు. ఇక రాణిబెణ్ణూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో రెబెల్‌గా రంగంలోకి దిగి శాసనసభ స్పీకర్‌ కె.బి.కోళివాడను ఓడించారు శంకర్. విధానపరిషత్‌ ప్రతిపక్షనేత, బీజేపీ ముఖ్యనాయకుడు ఈశ్వరప్ప కుమారుడు కాంతేశ్‌, శంకర్‌ను భేటీ అయ్యారు. ఈ లోపే ఆయన్ను కాంగ్రెస్ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల నేతలు సంప్రదించడం శంకర్ కు వరంగా మారింది. ఎవరు తనకు మంత్రి పదవి ఇస్తే వారికి ఓటు అని చెప్పారట ఆయన. అందుకే ఇరు పార్టీల నేతలు హామీనిచ్చారంటున్నారు. ఏదైనా కర్నాటకలో గెలవడం కాదు..అధికారం చేజిక్కించుకోవడం అంత కంటే కష్టంగా మారిందన్నది వాస్తవం.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*