బీజేపీ ఆఫ‌ర్‌..ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు, మంత్రి ప‌ద‌వి

కర్నాటకలో ఎవరు సీఎం అవుతారో ఇంకా టెన్షన్‌గానే ఉంది. అయితే ఇవాళ రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగుళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్‌లో కుమారస్వామిని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజూనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కుమారస్వామే సీఎం అవుతారని ఆయన చెప్పారు. తమపై ఎవరి ప్రభావం ఉండదన్నారు. ఇదిలాఉండ‌గా…కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాగైనా అధికారంలోకి రావడానికి చూస్తున్న బీజేపీ తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు, మంత్రి పదవి ఇవ్వజూపిందని ఆరోపించారు. ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు.
అధికారం కోసం ఆరాట ప‌డుతున్న బీజేపీ  కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌ని కుమార‌స్వామి ఆరోపించారు. తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ దగ్గర కోట్ల కొద్దీ డబ్బు ఉందని, అదంతా బ్లాక్‌మనీయా లేక వైట్ మనీయా అని కుమారస్వామి నిలదీశారు. నల్లధనంపై పోరు అంటూనే ప్రధాని మోడీ తన ఎమ్మెల్యేలను అదే బ్లాక్‌మనీతో కొంటున్నారని విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేథ యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడితో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుంది అని కుమారస్వామి అన్నారు. తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానన్న యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ముందు మీ మెజార్టీ ఎంతో చూసుకోండి అని చెప్పారు.
ఇదిలాఉండ‌గా… మరోవైపు బీజేపీ కూడా తమ పార్టీ చీఫ్‌గా యడ్యూరప్పను ఎన్నుకున్నది. తమ పార్టీ తనను చీఫ్‌గా ఎన్నుకున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు ఆయన చెప్పారు. గవర్నర్ తనకు ఆహ్వానం అందిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. సరైన నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని బీజేపీ నేత గుర్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*