ప‌ద‌వులా….టికెట్లా….

కాంగ్రెస్‌పార్టీలో ఉన్నంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు మరే పార్టీలో ఉండవంటే అతిశయోక్తి కాదు.. అంతర్గత వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఆ పార్టీ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటుంది. నేతలు ఒకరిపై ఒకరు తరచూ ఫిర్యాదులు చేసుకోవడం కాంగ్రెస్‌లో సర్వసాధారణం. నేతల మధ్య వివాదాలు.. విభేదాలు పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారేవి! అయితే తాజాగా కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు జిల్లా అధ్యక్షులను సందిగ్ధంలో పడేసింది. వచ్చే ఎన్నికల్లో డీసీసీలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది అధిష్టానం. దీంతో డీసీసీల టికెట్ల లొల్లి తెరపైకి వచ్చింది. గతంలోనే డీసీసీలకు టికెట్లు ఇవ్వబోమనే ప్రతిపాదన వచ్చినప్పుడు పార్టీలో తీవ్ర దుమారం రేగింది. తర్వాత పీసీసీ ఆ అంశాన్ని ప్రస్తావించలేకపోయేసరికి ఇక అధిష్టానం వెనక్కుపోయినట్టేనని అందరూ భావించారు. అయితే గత కొద్ది రోజులుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డీసీసీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని చెబుతుండటంతో డీసీసీలు గుర్రుగా ఉన్నారు. ఏఐసీసీ సమావేశాలలో కూడా రాహుల్‌గాంధీ ఇదే అంశాన్ని ప్రస్తావించారని ఉత్తమ్‌కుమార్‌ చెప్పడంతో డీసీసీ అధ్యక్షులంతా డైలమాలో పడిపోయారు. జిల్లా అధ్యక్షులుగా ఉండాలా..? లేక టికెట్‌ కోసం రాజీనామా చేయాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే టికెట్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు.. అలాంటప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మారుతుందేమోనన్న బెంగ పట్టుకుంది. ఇక అవే కాకుండా గ్రేటర్‌ అధ్యక్ష పదవి కోసం దానం నాగేందర్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌లు పోటీపడుతున్నారు. వారు టికెట్‌ కావాలంటే ఆ పదవులపై ఆశలు వదులుకోవలసిందే! అంతేకాదు ప్రస్తుతం మెదక్‌ జిల్లా అధ్యక్షులుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి వచ్చే ఎన్నికలలో నర్సాపూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. నిర్మల్‌ ప్రెసిడెంట్‌ మహేశ్వర్‌రెడ్డి అక్కడి నుంచే బరిలో నిలువనున్నారు. నల్లగొండ ప్రెసిడెంట్‌ బూడిద బిక్షమయ్యగౌడ్‌ కూడా ఆలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారంతా జిల్లా అధ్యక్ష పదవులను వదులుకోవలసి ఉంటుంది. అయితే ఇందులో కొందరు మాత్రం అటు జిల్లా అధ్యక్ష పదవులకు రాజీనామా చేయకుండానే.. టికెట్‌ సంపాదించే మార్గాలను వెతుక్కుంటున్నారు. తమ కుటుంబంలో ఒకరికి టికెట్‌ ఇప్పించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరికొందరు మాత్రం ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ పెద్దలను కలవాలనే ఆలోచనలో ఉన్నారట! ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులుగా కష్టనష్టాలకోర్చి పార్టీ కోసం పనిచేస్తే… డీసీసీలు సాకుగా చూపి టికెట్లు ఇవ్వకపోవడం సరికాదని పెద్దలకు వివరిస్తారట!మరి వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*