సినీ అరెస్టులు ఉంటాయా

జోరు వాన తగ్గినట్లు ఉంది. అంతలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిశబ్ద వాతావరణం ఉంది. ఏదో కర్నాటక ఎన్నికల హడావుడి తప్ప ఇంకేం లేదు. శ్రీరెడ్డిని దాదాపు మర్చిపోయారు జనాలు. కామెంట్లు లేవు. నిరసనలు లేవు. ధర్నాలు అంత కన్నా లేవు. మీడియాలో ప్రచారం తగ్గింది. ఫలితంగా శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. మొత్తం 28 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం కొనసాగుతోందని ఆ నటి ప్రస్తావించింది. సైబర్ క్రైం సహకారంతో కేసు నమోదు చేయాలని సూచించడం హాట్ టాపికైంది. 
తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది సినీ నటి శ్రీరెడ్డి. దగ్గుబాటి అభిరామ్ తో పాటు.. మరికొందరి పేర్లను బయట పెట్టినా ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకోవైపు పవన్ కల్యాణ్ పై చేసిన ఆరోపణల తర్వాత శ్రీరెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె చాటింగ్ లకు ఆదరణ తగ్గింది. ఇలాంటి సమయంలోను తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని చెబుతోంది శ్రీరెడ్డి. ప్రముఖ సినీ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్, హేతువాది బాబు గోగినేని, పవన్ కల్యాణ్ అభిమానులు, పలువురు సినీ నటులు, ఆర్టిస్టులు సహా మొత్తం 28 మందిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 
ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో తనపై దుష్ర్పచారం ఆగలేదని, కొందరు కావాలని, పనికట్టుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి వినతి పత్రం ఇచ్చిందామె. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డిపై అనేక కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెను చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు ఆమెను బూతులు తిడుతున్న పరిస్థితి ఉంది. అందుకే వారిపై శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఇంత చేసినా అసలైన వారిని వదిలి కొసరు వారిని పోలీసులు పట్టుకుంటారనే చర్చ సాగుతోంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*