మోహన్‌బాబు వెంకటగిరి నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారా?

రాజకీయాలందు మోహన్‌బాబు రాజకీయాలు వేరయా అంటుంటారు ఆయన సన్నిహితులు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో మోహన్‌బాబు రాజకీయాల్లోకి వచ్చారు. మోహన్‌బాబు పనితీరును మెచ్చిన ఎన్టీఆర్ ఆయనను రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు చిత్తూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో తనదైన ముద్రవేశారు. అయితే రామారావు మరణం తర్వాత మోహన్‌బాబు రాజకీయాలు మానేసి సినిమాల్లోనే కొనసాగారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మోహన్‌బాబు పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు మోహన్‌బాబు కూడా ఇటీవల ఓ హింట్ ఇచ్చారు.

 

మోహన్‌బాబు ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీతో సంబంధాలు ఉండడంతో ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తారని భావిస్తున్నారు. మోహన్‌బాబుతో వైసీపీ సీనియర్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపారని కూడా విశ్వసనీయ వర్గాల భోగట్టా. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మోహన్‌బాబును బరిలో దించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.

 

వెంకటగిరి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఊరు. వేలాది మంది చేనేత కార్మికులు తమ సృజనాత్మకతతో వస్త్రాలు నేస్తూ ప్రపంచ దేశాల్లోనూ గుర్తింపు పొందారు. వెంకటగిరిలో రాజకీయం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎన్నికల్లో ఫలానా వారు కచ్చితంగా గెలుస్తారని అనుకుంటే వాళ్లు సోదిలోనే లేకుండా పోతారు. ఓడిపోతారనుకున్న వ్యక్తులు ఆశ్చర్యంగా విజయం సాధిస్తుంటారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కూడా రెండుసార్లు ఓటమిపాలయ్యారు. అలాగే సినీనటి శారదను ఓడించింది కూడా వెంకటగిరి ఓటర్లే! ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశంపార్టీకి చెందిన కురుగుండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.

 

రామకృష్ణకు నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓట్లు వేసి గెలిపించారనీ, ఈసారి అలా జరగదు కాబట్టి సులభంగా విజయం సాధించవచ్చన్నది ప్రతిపక్షాల ఆలోచన! అది అలా ఉంచితే.. వెంకటగిరి నుంచి సినీ నటుడు మోహన్‌బాబును బరిలో దింపితే ఎలా ఉంటుందన్న అభిప్రాయానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధిష్టానం వచ్చిందట! కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోహన్‌బాబును ఎలాగైనా ఒప్పించి టికెట్‌ ఇవ్వాలని అనుకుంటున్నదట! ఇలాగని నియోజకవర్గంలో ఒకటే ముచ్చట్లు! చూద్దాం ఏం జరుగుతుందో!.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*