అనుకోకుండా చేశారో, కావాలని చేశారో తెలీదు కానీ..: చిరంజీవి

దివంగత నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మ‌హాన‌టి’ గత బుధవారం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాతకు మంచిపేరు తీసుకురావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లను ఆయన ఇంటికి పిలిచి మరీ స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన వైజయంతి బ్యానర్‌లో మళ్లీ సినిమా చేయాలని అనుకుంటున్నాను. పాతాళభైరవి లాంటి జానపద చిత్రం చేయాలని ఉంది. నాగ్ అశ్విన్ కూడా అలాంటి కథ తయారు చేసినట్టు చెప్పాడు. అన్నీ సెట్ అయితే నటించడానికి సిద్ధమే’’ అని చెప్పారు.

మహానటి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘అశ్వినీదత్ గారు ఎన్నో అద్భుతమైన కమర్షియల్ హిట్స్ ఇచ్చినా ‘శంకరాభరణం’ లాంటి గొప్ప సినిమా తీయాలనే కోరిక మిగిలిపోయింది. ‘మహానటి’ సినిమా ద్వారా ఆ కోరికను కుమార్తెలు తీర్చి ఆయనకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. తండ్రికి ఇంత సక్సెస్ ఇచ్చి కొడుకు లేని లోటు తీర్చారు. ఈ సినిమాకు రికార్డులే కాదు.. అవార్డులు కూడా వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలి. మే 9న నా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా రిలీజ్ అయింది. 28 ఏళ్ల తర్వాత అదే రోజున ‘మాహానాటి’ కూడా రిలీజ్ చేశారు. అనుకోకుండా చేశారో.. లేక కావాలని అలా ప్లాన్ చేశారో తెలీదు గానీ చాలా సంతోషంగా ఉంది. దర్శకనిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*