అలిపిరి ఘటనపై కేంద్రం ఆరా

తిరుమలలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. అసలు ఏం జరిగిందనే విషయంపై నివేదికలు తెప్పించుకున్నారు. కావాలనే టీడీపీ చాలా ప్రణాళికతో అమిత్ షా మీద దాడి జరిపిందని బీజేపీ వాదిస్తుండగా.. ఏదో కొంతమంది నిరసన తెలిపారు. అంతేతప్ప మరేం జరగలేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కర్నాటక ఎన్నికల ముందు ఇలాంటి సంఘటన జరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకు హోదా ఇవ్వని బీజేపీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారనే వాదన సాగుతుండగా.. కాదు కాదు టీడీపీ కావాలని ఇలాంటి పనులు చేయిస్తుందని బీజేపీ అంటోంది. తిరుమల ఘటనపై సిఎం చంద్రబాబు స్పందించారు.  
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పార్టీ శ్రేణులను ఆదేశించారు బాబు. పార్టీ క్రమశిక్షణకు బద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. మన వద్దకు అతిథిగా వచ్చినప్పుడు గౌరవంగా చూడాలని.. రాజకీయాలు వేరు. తిరుమల దర్శనం వేరు అని చెప్పారు. తిరుమలలో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు. కొందరు తెలిసీ తెలియక ఇలా చేశారని… ఇక ముందు అలా చేయవద్దని చెప్పారు. 
ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది నిజమే. మనం దానిపై ధర్మపోరాటం చేయాలి. చేస్తున్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరాలి. దాడులు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. కేంద్రం సహాకరం అందించక పోయినా తాము అభివృద్ధి చేసుకుంటున్నామని ప్రస్తావించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత టీడీపీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అయినా సరే తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని బాబు చెప్పడం హాట్ టాపికైంది. ముఖ్యమంత్రిగా ప్రధానిపై పోరాడుతున్నాం. అంతే తప్ప వ్యక్తిగతంగా తమకు వారితో ఎలాంటి వైరం లేదన్నారు చంద్రబాబు. 
రాళ్లదాడి దురదృష్టకరమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పగా.. అబ్బే అసలు రాళ్ల దాడి జరగలేదని డిప్యూటీ సిఎం చినరాజప్ప చెప్పడం మరింత విచిత్రంగా ఉంది. ఏదో కొన్ని వాహనాలపై రాళ్లు పడ్డాయని హోంమంత్రి చినరాజప్ప సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా టీడీపీపై బీజేపీ మరింతగా దృష్టి సారించనుందని తెలుస్తోంది.  

1 Comment

  1. ఆయనపై ప్రత్యక్ష దాడి జరిగినట్లు లేదు. కేవలం నిరసనలు తెలపడానికి నల్ల జెండాలతో ఉద్యమకారులు గుమికూడినట్లు విజుయల్స్ ఉన్నాయి. . సమస్యలకు మూలకారణమైన వ్యక్తి కనబడినపుడు నిరసన వ్యక్తం చేయడం ఉద్యమంలో భాగంగా చూడాలి తప్ప, దాడిగా చూడకూడదు. భాజపా పార్టీగానీ, కేంద్రం గానీ ఆంధ్రరాష్ట్రం పై చేస్తున్న దాడి కి సమాధానం చెప్పమంటే ఇలా ఎదురుదాడి చేయడం భాజపాకే చెల్లింది.

Leave a Reply

Your email address will not be published.


*