మెహబూబా రివ్యూ

 

 

 

 

టైటిల్ : మెహబూబా
జానర్ : లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌
తారాగణం : ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే
సంగీతం : సందీప్‌ చౌతా
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
నిర్మాత : పూరి కనెక్ట్స్‌

ఏడాదికి నాలుగు సినిమాలు తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఎంతో మంది హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చిప్పిన పూరీ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు. టెంపర్ తర్వాత మూడేళ్లుగా అలాంటి హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గతేడాది బాలయ్యతో చేసిన సినిమా నిర్మాతలకు ‘పైసా వసూల్’ అయితే చేసిపెట్టింది గానీ… పూరీకి ఎలాంటి గుర్తింపూ తీసుకురాలేదు. దీంతో తన కుమారుడు ఆకాశ్‌పూరీనే హీరోగా పెట్టి ‘మెహబూబా’ పేరుతో ఒక బోర్డర్ ప్రేమకథను తెరకెక్కించాడు. ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా పూరీ రీలాంఛ్‌కు పనికొచ్చిందో, లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

కథ:
రోషన్‌(ఆకాశ్‌పూరి)ను చిన్న తనం నుంచి ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తుంటాడు. అదే సమయంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌‌లో ఉన్న అఫ్రీన్‌(నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేశారని భయపడుతుంటుంది. చిన్నపిల్లలుగా వాళ్లిద్దరికీ వచ్చిన కలలను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోరు. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్‌, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్‌ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాకు వస్తుంది. హైదరాబాద్‌లో ఓ హాస్టల్‌లో జాయిన్ అవుతుంది. తన హాస్టల్‌మేట్స్‌తో కలిసి బయటకు వచ్చిన అఫ్రీన్‌ను కొంతమంది కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ సమయానికి రోషన్ వచ్చి అఫ్రీన్‌ను ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్‌ ముఖం చూడని అఫ్రీన్‌.. ఎలాగైనా తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్‌ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్‌ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి అబద్ధం చెప్పించి ఆమెను తిరిగి పాకిస్తాన్ పిలిపిస్తాడు.

పాకిస్తాన్‌ వెళ్లేందుకు ట్రైన్‌లో బయలుదేరిన అఫ్రీన్‌‌. అదే ట్రైన్‌లో హిమాలయాలకు వెళ్తున్న రోషన్‌ను కలుస్తుంది. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన‍్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పుట్టిందని తెలుసుకుంటాడు. అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? పాకిస్తాన్‌ వెళ్లిపోయిన అఫ్రీన్‌ను రోషన్‌ ఎలా కలవగలిగాడు..? చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారన్నది థియేటర్‌లో చూడాల్సిందే!.

విశ్లేషణ:
చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్‌ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈసారి తన రెగ్యులర్‌ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్‌ జానర్‌లో డిఫరెంట్‌ టేకింగ్‌తో చేశాడు. కానీ పూరి ప్రయత్నం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ బోర్డర్‌ను అడ్డుపెట్టాడు. ఆ బోర్డర్‌ను బద్ధలు కొట్టుకుని ప్రేమికులు ఎలా ఒక్కటయ్యారనేదాన్ని ఢిఫరెంట్ స్టయిల్‌లో, ఢిఫరెంట్ టేకింగ్‌తో చూపించినా అది ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమాలో పూరి మార్క్‌ హీరోయిజం, డైలాగ్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ముఖ్యంగా కథనంలో వేగం లేకపోవటం, ఏ మాత్రం లాజిక్‌ లేని సన్నివేశాలు ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ఇది పూరి సినిమానేనా అన్న భావన కలిగిస్తాయి. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్‌ చౌతా పరవాలేదనిపించాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్‌ సీన్స్‌ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

నటీనటుల పనితీరు:
ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాశ్.. చాలా రోజుల తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్‌ హీరోగా రీలాంచ్‌ అయ్యాడు. అయితే రెగ్యులర్‌ ఫార్మాట్‌ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ ఉన్న ఈ సినిమాలో రెండింటిలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్‌ పరంగా మెప్పించినా.. కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది. యాక్షన్‌ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చూపించే ఛాన్స్‌ మాత్రం ఆకాష్‌కు దక్కలేదు. హీరోయిన్‌గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషురెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
సినిమాటోగ్రఫి
ఫస్ట్‌ హాప్‌లో కొన్ని డైలాగ్స్‌
నిడివి తక్కువగా ఉండడం

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్‌ప్లే
కథ
లాజిక్‌ లేని సీన్స్‌

చివరిగా..: అటు పుత్రోత్సాహము, ఇటు పితోృత్సాహము రెండూ లేకుండా చేసిన మెహబూబా

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*