ప‌వ‌న్ సైలెంట్ వెనుక వ్యూహం ఏమిటో? 

జ‌నసేనాని సైలెంట్ అయ్యారు. మొన్న‌టి వ‌ర‌కూ దుమ్ము దుమారం అయ్యేలా పంచ్‌లు.. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఇర‌గ‌దీశాడు. పొలిటిక‌ల్‌గా అది మైలేజ్ ఇచ్చింద‌నే అభిమానులు భావిస్తున్నారు. కార్య‌క‌ర్త‌లు కూడా.. ప‌వ‌న్ మాట‌ల‌తో ఉబ్బిత‌బ్బిబ‌య్యారు. మ‌రి ఇంత‌లో.. ఎందుకింత మౌనంగా ఉన్నార‌నేది మాత్రం భ‌రించ‌లేక‌పోతున్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. 175 స్థానాల్లో బ‌రిలోకి దిగితే స‌త్తా చాటేందుకు ఎలా సిద్ధ‌మ‌వ్వాల‌నేది వారి వాద‌న‌. వారి ఆలోచ‌న‌లో నిజం ఉన్నా.. ప‌వ‌ర్‌స్టార్ ఎందుకీ నిర్ణ‌యం తీసుకున్నార‌నేది అంతుచిక్క‌కుండా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో మాత్రం ప‌వ‌న్ ట్రంప్ లాంటి వాడంటూ.. పోస్టులు వ‌స్తున్నాయి. అమెరికాలో ఉన్న ప్ర‌జ‌లు విద్యావంతులు కావ‌టం.. అక్క‌డి ప‌రిస్థితులు.. రాజ‌కీయాలు వేరు. కానీ.. ఏపీ వంటి రాజ‌కీయ చైత‌న్యం ఉన్న‌చోట మాట‌లు.. చేత‌లు జ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటారు. ఏదో స‌ర‌దాగా మాట్లాడిన అంశాల‌నూ సీరియ‌స్‌గా తీసుకునేంత‌గా ఉంటారు.
ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ప‌వ‌ర్‌స్టార్‌.. బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒక‌రోజు మీడియా స‌మావేశంలో విష‌యాలు వెల్ల‌డించారు కూడా.. వ్యూహ‌క‌ర్త‌గా దేవ్ అనే వ్య‌క్తిని ప‌రిచ‌యం చేశారు. ఇది రాజ‌కీయంగా కాస్త దుమారం రేపిందనే చెప్పాలి. అటు వైసీపీలో ప్ర‌శాంత్‌కిషోర్‌, ఇటు జ‌న‌సేన‌లో దేవ్ బీజేపీ వైపు ప‌నిచేశారంటూ విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు దిగాయి. దీనికి ప్ర‌తిగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా.. త‌గు స‌మాధానం ఇస్తున్నారు. టీడీపీ వైపున వున్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కూడా ఒక‌ప్పుడు బీజేపీ మ‌నిషేనంటూ కౌంట‌ర్ ఇస్తున్నాడు. పైగా.. ప్ర‌భాక‌ర్ స‌తీమ‌ణి.. నిర్మ‌లా సీతారామ‌న్ బీజేపీ కేబినెట్‌లో కీల‌క‌మైన ర‌క్షణ మంత్రిత్వశాఖ బాధ్య‌త‌లు వ‌హిస్తున్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఎవ‌రి ఎత్తులు.. ఎత్తుగ‌డ‌లు వారికే ఉన్నా ప‌వ‌న్ ఈ విష‌యంలో ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు. అనుభ‌వం ఉన్న నేత‌లు.. ఎంతో కేడర్ ఉన్న పార్టీల‌తో ఒంట‌రిగా పోటీప‌డే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ఇలాగే ఉంటే.. మ‌న ప‌రిస్థితి ఏమిట‌నేది కూడా.. జ‌న‌సైనికుల ఆందోళ‌న‌. దీనిపై స‌మాధానం చెప్పాల్సింది కూడా కాట‌మ‌రాయుడే మ‌రీ. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*