భరత్‌ అనే నేను మూవీ సమీక్ష

సినిమా : భరత్‌ అనే నేను
రేటింగ్ : 3/5
నటీనటులు: మహేష్‌బాబు, కైరా అడ్వాణీ, ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌, ఆమని, సితార, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి, రావూ రమేష్‌, బ్రహ్మాజీ తదితరులు
ఛాయా గ్రహణం: రవి కె చంద్రన్‌
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌
నిర్మాత : డీవీవీ దానయ్య
రచన, దర్శకత్వం: కొరటాల శివ
పరిచయం :
శ్రీమంతుడితో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన మహేష్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది అనగానే సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. అందులోనూ సమాహితమైన సినిమా అంటూ ముందుగానే ప్రకటించడం… టీజర్‌.. ట్రైలర్‌లలో సీఎంగా మహేష్‌బాబు దర్శనమివ్వడంతో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పటికే ఒకే ఒక్కడు, లీడర్‌ సినిమాలు కూడా హీరో సీఎంగా కనిపించి చరిత్రలో గుర్తిండిపోయే విజయాలను అందుకున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ రాజకీయ అజెండాలు కీలకంగా ఉన్న తరుణంలో వచ్చే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమా అవడంతో ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతుందా అనేది కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. ఇన్ని రకాలుగా ఎదురు చూస్తున్న తరుణంలో భరత్‌ అనే నేను సినిమాతో మహేష్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేశారు.. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు ఎలాంటి బలమైన కథతో కొరటాల శివ ముందుకొచ్చారు.. అనేది పరిశీలిద్దాం.. 
కథ
ఏపీ ముఖ్యమంత్రి రాఘవరాజు(శరత్‌కుమార్‌) చనిపోవడంతో లండన్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదువుతున్న భరత్‌రామ్‌(మహేష్‌బాబు) ఆగమేఘాలమీద ఇండియా వస్తాడు. అనూహ్యపరిణామాల మధ్య శరత్‌కుమార్‌ ఆప్తమిత్రుడు, పార్టీని నడిపించే వరదరాజులు(ప్రకాశ్‌రాజ్‌) అండతో ముఖ్యమంత్రిగా భరత్‌ బాధ్యతలు తీసుకుంటాడు. ఆ తరువాత ఎవరి సలహాలను తీసుకోకుండా విచక్షణతో ప్రజాహిత నిర్ణయాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దాంతో ప్రజల్లో క్రేజ్‌ సంపాదించుకుంటారు. ఇలాంటి సమయంలో మింగుడుపడని రాజకీయనాయకులు ఆయన్ని ఎలా గద్దె దింపారు..? తరువాత ఎలా సీఎంగా భరత్‌ ఉండాలని ప్రజాఉద్యమం జరిగింది..? తరువాత రాజకీయ నాయకుల ఎత్తుగడలను ఎలా చిత్తు చేశారనేది సినిమా..
విశ్లేషణ
కథానాయకుడు అనగానే మంచి లక్షణాలు ఉంటాయి.. అందరికి మేలు చేసే వాడై ఉంటాడు.. మరి అలాంటి వాడు ఉన్నత స్థానంలో ఉంటే ఎలాంటి సమాజహిత చర్యలు తీసుకుంటాడో సాధారణంగా అంచనా వేయోచ్చు.. సరిగ్గా అదే కోణంలో అర్జున్‌ ఒకే ఒక్కడు.. రానా లీడర్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మహేష్‌ కూడా అదే ఇతి వృత్తంతో భరత్‌ అనే నేను ఎంచుకున్నాడు. గతంలో చూసిన సినిమాల కంటే భిన్నంగా మరింత ఆసక్తి కరంగా ఉండాలనే అంచనాలు లేకుండా వెళితే దర్శకుడు ఆలోచనలు రంజింపజేస్తాయి. లేదంటే ఏదో కోరుకున్నాం.. ఏదో మిస్సాయ్యాం అనే భావన కలుగుతుంది. నటన పరంగా మహేష్‌ బాబు మరో శిఖరాన్ని అధిరోహించినా.. బలమైన సన్నివేశాలు లేకపోవడం, చెప్పాలనుకునే విషయంలో ఎమోషన్‌ ప్రజలకు చేరేలా చూపెడ్డంలో కొరటాల శివ గాడి తప్పాడనే చెప్పాలి. రాష్ట్ర సీఎం అంటే విధులు ఎలా ఉంటాయి.. ఒక నిర్ణయం తీసుకోవాలంటే వారు ఎంత కసరత్తు చేయాలి.. చట్టం.. రాజ్యాంగానికి లోబడి ఎలా నడుచుకోవాలి అనే కనీస అంశాలను పరిశీలించి సినిమాని తెరకెక్కించి ఉంటే ఫలితం అద్భుతంగా ఉండేది. మహేష్‌ బాబు సీఎం అవ్వడానికి బలమైన కారణాలు లేకపోవడం.. సినిమాలో విలన్‌గా చూసే వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా లాజిక్‌ లేకుండా మహేష్‌ని సీఎం చేయడం… చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్‌ అయి సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఇలా ఒకటేమిటి లాజిక్‌ లేని సన్నివేశాలకు సినిమా నెలవుగా మార్చిన కొరటాల శివ అంతిమంగా ఏం చెప్పాలనుకున్నాడో ప్రేక్షకుడికి అర్థం కాదు. ట్రాఫిక్‌ సమస్యలు, విద్యపై ప్రభుత్వ విధానం వంటి రెండు మూడు సోషల్‌ మీడియాలో నిత్యం చర్చ జరిగే సన్నివేశాలను మాత్రమే రాసుకుని వాటితోనే సీఎం కీర్తిని పెంచాలని ప్రయత్నించడం అంత అతికినట్లు కనిపించదు. మరోవైపు స్థానిక ప్రభుత్వాల బలోపేతం అనే అద్భుత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా దాన్ని ఆశించిన స్థాయిలో చూపలేకపోవడం వంటి కారణాలతో భరత్‌ అనే నేను కొంత దారి తప్పిందనే చెప్పాలి. మహేష్‌బాబు లాంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరో చేతిలో ఉన్నాడు.. అద్భుతాలు చేసే స్థానంలో ఉన్న కథానాయకుడితో సమాజం కోరుకునే రీతిలో మార్పులు చేసి వాటి ఫలితాలను వివరించి.. ప్రస్తుతం ప్రభుత్వాలకు ఒక సవాలు విసిరే అవకాశం ఉన్నా కొరటాల శివలో ఉన్న రచయిత మాత్రం కథను పైపైనే తేల్చేశాడు. ఇక హీరోయిన్‌ పాత్ర కొస్తే అన్ని సినిమాల్లోలాగానే రెండు పాటలు, నాలుగు సన్నివేశాల కోసమే అన్నట్లు మారిపోయింది. అందరు సీనియర్‌ నటులు ఉండటంతో వారి ప్రతిభతో ప్రతి సన్నివేశం గంభీరంగా తీయగలిగారు కాని సామాన్యుడితో ఏ రకంగాను కనెక్ట్‌ కాలేకపోయారు.
నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా ఉండటంతో సినిమా ఆసాంతం చాలా రిచ్‌గా కనిపిస్తుంది. దేవీశ్రీ మాయాజాలంతో ఆధ్యాంతం ఆసక్తిని కలిగించే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. పాటలు సినిమాకి అదనపు భారంగా మారాయి. అనవసరంగా ఎందుకొచ్చాయిరా అన్నట్లు ఉంటుంది. కెమెరా పనితనం బావుంది. రచయిత కొంత దెబ్బతిన్నా తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో కొరటాల శివ కథనం కొంతమేర పర్వాలేదనిపించాడు. 
ప్లస్‌ పాయింట్లు
+ మహేష్‌బాబు నటన
+ సామాజిక అంశాల నేపథ్యంలోని కథాంశం
+ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌
+ నిర్మాణ విలువలు
మైనస్‌ పాయింట్లు
– వాస్తవ పరిస్థితులకు దూరంగా కథనాయకుడు ఉండటం
– లోతు లేని కథ
– కథకు సంబంధం లేని పాటలు
– బలహీనమైన పతాక సన్నివేశం
ఫలితం
మహేష్‌బాబు ఇమేజ్‌తో సినిమాని ఆసాంతం మోయాల్సి వస్తుంది. ఏం ఆశించకుండా, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగ ఎలా పనిచేస్తుందో తెలియని వ్యక్తులు సినిమా చూస్తే కొంతమేర సంతృప్తి పడతారు. పరీక్షలైన తరువాత వచ్చిన సినిమా కాబట్టి ఎదో అలా ఒక సారి చూద్దాంలే అనుకునే వారి సంఖ్యతో కలెక్షన్ల పరంగా లోటు ఉండదు.
భరత్‌ అనే నేను.. అన్ని సినిమాల్లానే…

2 Comments

  1. సినిమ సూపర్. మహేష్ సూపర్. Music super. Fights super. Direction super. Dialogues super. Press meet episode super. ఇంకా ఏమికావాలి సామి

Leave a Reply

Your email address will not be published.


*