ప్ర‌ధాని నోట జ‌గ‌న్ పేరు…

అసలే ఎన్నికల సంవత్సరం. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీలోని కొంతమంది వినిపిస్తున్న అపస్వరాలు ఆ పార్టీకి చికాకు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాన్ని బయట వేరేరకంగా ప్రచారం చేయడం పట్ల కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్‌డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడానికి గల కారణాలను ఎమ్మెల్యేలకు సోదాహరణంగా వివరించారు. కేంద్రమంత్రుల రాజీనామాకు ముందు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసినవే! కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దానిని సరిచేస్తారేమోనిని ఎదురుచూసినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో కేంద్రమంత్రులతో రాజీనామా చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రధాని మోదీకి వివరించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆయన అందుబాటులోకి రాలేదు. మరుసటి రోజు ఉదయం కేంద్రమంత్రులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సాయంత్రం మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. రాజీనామా చేస్తున్నట్లు బాబు ఆయనకి చెప్పారు. కొంతకాలం ఆగితే బాగుంటుందని మోదీ సూచించగా, నాలుగు సంవత్సరాలు ఆగామనీ, ప్రజల నుంచి తీవ్ర వత్తిడి వస్తోందనీ, మేము ఇంకా ఎన్‌డీఏలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలనీ చంద్రబాబు మోదీకి చెప్పారు.
ఈ రాజీనామాల వల్ల జగన్ బలపడే అవకాశం ఉంది కదా? అని మోదీ తనతో వ్యాఖ్యానించారని చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు వివరించారు. దీనివల్ల వైసీపీ బలపడుతుందనీ, ఎన్‌డీఏకి నష్టమనీ, ప్రత్యేకహోదా కోసం ఇప్పుడు రాజీనామా చేయడం బాగోలేదనీ మోదీ తనతో చెప్పారని అంటూ “ప్రధాని మోదీ, జగన్‌ల మధ్య ఉన్న సంబంధాలేంటో ఆయన మాటల వల్లే తెలిసిపోతోందని” ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం చోటుచేసుకునే సమయానికే బీజేపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఒక అవగాహన ఉందేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇంతవరకూ జరిగింది బాగానే ఉంది కానీ, ఈ మాటలు విన్న టీడీపీ ఎమ్మెల్యేలు బయట వేరే రకంగా ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. జగన్ ఇప్పటికే రాష్ట్రంలో బలపడ్డారనీ, మీ రాజీనామాల వల్ల అతను మరింత బలపడతారనీ, ప్రత్యేకహోదా ఉద్యమం వల్ల లాభం వైసీపీకే ఉంటుందనీ ప్రధాని మోదీ చంద్రబాబుతో చెప్పారంటూ టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్‌గా చెబుతున్నారు. యథాతథంగా ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పలేక “జగన్ బలపడతాడంటూ మోదీ వ్యాఖ్యానించారనీ, వారిద్దరి మధ్య ఉన్న అంతర్గత సంబంధాలకు ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అనీ” చంద్రబాబు మార్చి చెప్పారంటూ ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారం టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఈ ప్రచారంపై కొందరు తెలుగు తమ్ముళ్లు క్లారిటీ ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పింది వేరు- బయట ప్రచారం జరుగుతున్నది వేరని మెజారిటీ నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి బీజేపీకి, వైసీపీకి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని చెప్పడం కోసమే చంద్రబాబు ప్రధాని మోదీ మాటలను ఉదహరించారనీ, అంతకుమించి ఆయన ఏమీ చెప్పలేదనీ టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏలో ఉన్న టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల వల్ల జగన్ బలపడతాడేమోనన్న సందేహాన్ని మాత్రమే మోదీ వ్యక్తం చేశారనీ, టీడీఎల్పీలోని తన ప్రసంగంలో చంద్రబాబు ఈ సంగతే చెప్పారనీ వారు స్పష్టం చేశారు. ఈ అంశాన్నే చిలవలు- పలువలు చేసి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారనీ, వారి చెప్పే మాటల్లో నిజం లేదని కూడా తెలుగుదేశంపార్టీకి చెందిన సీనియర్ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటల్లోని స్ఫూర్తిని మాత్రమే అర్ధం చేసుకోవాలనీ, వాటికి పెడర్ధం తీయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని కూడా వారు చురకలు వేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను మార్చి ప్రచారం చేస్తున్న వారి గురించి, ఏదో ఊహించుకుని దానికి సొంత పైత్యం జోడించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలో కొందరు నేతల నోళ్లకి తాళం పడినట్టు సమాచారం! 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*