బంద్ తో ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయంపై ఊరువాడ కదిలింది. టీడీపీ, బీజేపీ తప్ప మిగతా పక్షాలన్నీ ఏపీ బంద్ చేశాయి. ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీలో బంద్ కు అనూహ్య స్పందన వచ్చింది. బస్సులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇవ్వగా, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ.ఎంఎల్, కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం బంద్ కు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇవాళ తెల్లవారు జూము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, రాయలసీమ జిల్లాలో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళనలు చేసింది. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆయా చోట్ల దుకాణాలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకుని వదిలారు. బంద్ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదానికి తావిచ్చింది. 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చేపట్టిన బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగింది. బంద్‌ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. మరోవైపు బంద్‌ విచ్ఛిన్నానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేయడం ఆశ్చర్యమే. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని వారు నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బంద్ తో సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడేవాళ్లు. బంద్ ల వల్ల అభివృద్ధి కుంటుబడుతుందని సిఎం చంద్రబాబు చెప్పిన మాట. కేంద్రంతో లాలూచీ పడిన చంద్రబాబు బంద్ ను విఫలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఫలితంగా టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయింది. 
ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని నార్త్ ఈస్త్రన్ స్టేట్ లకు ఎందుకు యిచ్చారని మరోవైపు టీడీపీ.. ప్రధాని మోడీని ప్రశ్నిస్తోంది. మీరేమో గుజరాత్ లో లక్ష కోట్లతో బోలేరా సిటీని నిర్మిస్తారు. అమరావతి రాజధానికి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇస్తారా. ఇదేనా మీరు చేసేదని నిలదీశారు. ఇందుకు బీజేపీ నేతల నుంచి సమాధానమే కరువైంది. విద్యా సంస్థలకు మీరు ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టే ఏపీకి నిధులు ఇచ్చారని చెబుతోంది టీడీపీ. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించడానికి ఈనెల 20న చంద్రబాబు దీక్ష చేస్తున్న సంగతిని ప్రస్తావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*